Gas Cylinder : గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన కమర్షియల్ సిలిండర్ ధరలు!

ప్రతీ నెల మొదటి తేదీన గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు వస్తుంటాయి. గత కొంతకాలంగా ఎల్‌పీజీ ధరలు పెరుగుతూ వచ్చాయి. అయితే ఈ సెప్టెంబర్ నెలలో గ్యాస్ వినియోగదారులకు సంతోషకరమైన వార్తను ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి. కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలను గణనీయంగా తగ్గించినట్లు ప్రకటించాయి.

19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై రూ.51.50 తగ్గింపుతో, కొత్త ధర రూ.1,580గా నిర్ణయించారు. ఈ ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయి. అయితే ఈ తగ్గింపు కేవలం కమర్షియల్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. గృహ అవసరాల కోసం వినియోగించే 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు.

హోటల్స్, రెస్టారెంట్లు, ఇతర వ్యాపారాలు అధికంగా వాణిజ్య సిలిండర్లను వినియోగిస్తాయి. కాబట్టి ఈ తగ్గింపుతో వారి నిర్వహణ ఖర్చులు తగ్గి, వ్యాపారులకు మంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా వ్యాపారులకు ఇది ప్రయోజనకరంగా మారనుంది.

ఈ ఏడాది మార్చి తప్ప మిగతా నెలల్లో కమర్షియల్ ఎల్‌పీజీ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా చేసిన ఈ తగ్గింపు వ్యాపారుల భారాన్ని కొంత తగ్గించనుంది. కానీ గృహ వినియోగదారుల కోసం మాత్రం ఎలాంటి రాయితీ లేకపోవడంతో, పాత ధరలే కొనసాగనున్నాయి.

Leave a Reply