Tetra Pack: రూ.105కే క్వార్టర్ మద్యం.. టెట్రా ప్యాక్‌ల్లో సప్లైకి ఎక్సైజ్ శాఖ ప్రణాళికలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ సీన్‌ను గమనించిన ఎక్సైజ్ శాఖ, ఇప్పుడు కొత్త దారులను అన్వేషిస్తోంది. తక్కువ ధరలో మద్యం అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో కొన్ని వినూత్న ప్రతిపాదనలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా టెట్రా ప్యాకింగ్ విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.

కర్ణాటక మాదిరిగా ఇప్పుడు టెట్రా ప్యాకెట్లలో మద్యం అమ్మకాలకు రంగం సిద్ధం చేస్తున్నారు. 60 ఎంఎల్‌, 90 ఎంఎల్‌, 180 ఎంఎల్‌ పరిమాణాల్లో టెట్రా ప్యాక్‌లను తయారు చేసి, ఫ్రూట్ జ్యూస్ తరహాలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని యోచన. ఈ ప్యాకెట్లను సులభంగా జేబులో పెట్టుకుని తీసుకెళ్లొచ్చు. ఒకవేళ ఈ ప్రతిపాదనకు ప్రభుత్వ ఆమోదం లభిస్తే, త్వరలోనే షాపుల్లో టెట్రా ప్యాక్ మద్యం దర్శనమిస్తుంది.

ప్రస్తుతం క్వార్టర్ చీప్ లిక్కర్ ధర సుమారు రూ.120గా ఉండగా, టెట్రా ప్యాక్ వస్తే అదే మద్యం రూ.105కే దొరుకుతుందన్నది అధికారుల అంచనా. ఇలా చూస్తే ఒక్కో క్వార్టర్‌పై మందుబాబులకు కనీసం రూ.15 వరకూ ఆదా అవుతుంది. టెట్రా ప్యాకింగ్ ఖర్చు తక్కువగా ఉండటంతో కంపెనీలకు, వినియోగదారులకు, ప్రభుత్వానికి అన్నివైపులా లాభమే అని అధికారులు భావిస్తున్నారు.

ఎక్సైజ్ శాఖ ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించింది. అధికారిక ఆమోదం లభించిన వెంటనే అమలు దశకు తీసుకురావాలని యోచిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2620 వైన్ షాపులు, 1117 బార్లు ఉన్నాయి. వీటికి 55 దేశీయ, విదేశీ కంపెనీలు మద్యం సరఫరా చేస్తున్నాయి. ఇప్పుడు వీటి ద్వారా టెట్రా ప్యాక్‌లు అందుబాటులోకి వస్తే, మార్కెట్‌లో మరింత వృద్ధి ఆశించవచ్చు.

ఇప్పటికే కర్ణాటకలో మెక్‌డొవెల్స్ నంబర్ వన్ కంపెనీ 90 శాతం మద్యం టెట్రా ప్యాకెట్లలోనే విక్రయిస్తోంది. అదే విధానాన్ని ఇప్పుడు తెలంగాణలో అమలు చేయాలనే దిశగా అధికారులు చర్చలు జరుపుతున్నారు. కర్ణాటకలో 90 ఎంఎల్‌, 180 ఎంఎల్‌ ప్యాకెట్లు ఉంటే, తెలంగాణలో అదనంగా 60 ఎంఎల్‌ ప్యాకెట్లు కూడా అందుబాటులోకి తేవాలని ప్రతిపాదించారు.

మద్యం ధరలు తగ్గితే అమ్మకాలు పెరుగుతాయన్న భావనతో ఈ ప్రణాళికను రూపొందించారు. వినియోగదారులకు తక్కువ ధరకే మద్యం లభిస్తే, అమ్మకాలు మళ్లీ పెరిగి ప్రభుత్వ ఖజానా నింపుతుందన్నది ఎక్సైజ్ శాఖ అంచనా.

ఇప్పుడు అన్నీ ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ ఆమోదం లభిస్తే.. టెట్రా ప్యాక్‌ల మద్యంతో మార్కెట్ ఓ కొత్త మలుపు తియ్యనుంది.

Leave a Reply