కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం: చిన్నటేకూరులో ప్రైవేట్ బస్సు దగ్ధం – 11 మంది మృతి

కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ ప్రైవేట్‌ బస్సు తెల్లవారుజామున ప్రమాదానికి గురై మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే దగ్ధమై మృతిచెందగా, మరికొందరు గాయాలతో బయటపడ్డారు.

24వ తేదీ తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. 41 మంది ప్రయాణికులను తీసుకెళ్తున్న బస్సు చిన్నటేకూర గ్రామ పరిధిలో ఒక బైక్‌ను ఢీకొనడంతో ఇంధన ట్యాంక్ పగిలి మంటలు చెలరేగాయి. మంటలు క్షణాల్లో వ్యాపించడంతో బస్సు మొత్తం అగ్నికి ఆహుతయింది.

ప్ర‌మాద స‌మ‌యంలో కొంద‌రు ప్రయాణికులు కిటికీల ద్వారా బయటకు దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. మొత్తం 21 మంది సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు. మిగిలిన 20 మందిలో 11 మంది మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. మిగిలిన వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.

జిల్లా కలెక్టర్‌ డా. ఏ. సిరి ఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. రక్షణ, శోధన చర్యల్లో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.

ఈ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. బాధిత కుటుంబాలకు సహాయం అందించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. ఘటనపై ప్రజాప్రతినిధులు, అధికారులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Leave a Reply