హైదరాబాద్ (Hyderabad) కూకట్‌పల్లి (Kukatpally Murder Case) లో 12 ఏళ్ల బాలికను పదో తరగతి చదువుతున్న బాలుడు హత్య చేసిన ఘటనలో ఆశ్చర్యకరమైన నిజాలు బయటపడ్డాయి. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వెల్లడించిన వివరాల ప్రకారం, ఆ బాలుడు డబ్బులు దొంగతనం చేయడానికి కాదు, క్రికెట్ బ్యాట్ (Cricket Bat) కోసం వెళ్లాడట.
బాలిక తమ్ముడు ఆడుకునే బ్యాట్ నచ్చడంతో దాన్ని తీసుకెళ్లాలని నిందితుడు నిర్ణయించుకున్నాడు. అయితే బాలిక దొంగ అని అరవడంతో భయపడి, తనతో తీసుకువెళ్లిన కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు.
సీపీ వివరాల ప్రకారం, నిందితుడు తరచూ ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్లు చూసేవాడు. వాటి ప్రభావంతో తప్పించుకునే పద్ధతులను నేర్చుకున్నట్లు అనిపిస్తోందని తెలిపారు. హత్య తర్వాత నిందితుడు తన తల్లిని కూడా మభ్యపెట్టాడట. టెర్రస్ నుంచి దూకుతుండగా ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతడిని గమనించడంతో కేసులో కీలకమైన క్లూ లభించిందన్నారు.
దర్యాప్తులో నిందితుడి ఇంట్లో కత్తి, లెటర్ వంటి ఆధారాలు దొరికాయని పోలీసులు తెలిపారు. హత్య అనంతరం కత్తిని కడిగి, దుస్తులు మార్చుకుని వాషింగ్ మెషీన్‌లో వేసేశాడని కూడా చెప్పారు. ఇది చాలా సవాళ్లతో కూడిన కేసు అని సీపీ పేర్కొన్నారు.
బ్యాట్ కొనివ్వలేని పరిస్థితి కుటుంబంలో ఉందని భావించి దొంగతనం చేయాలని బాలుడు నిర్ణయించుకున్నాడని పోలీసులు వివరించారు. హత్య చేసిన తర్వాత లెటర్‌ను ఇంట్లో దాచిపెట్టాడని తెలిపారు.
ఈ ఘటనపై బాలిక తండ్రి తీవ్రంగా స్పందిస్తూ, తన 12 ఏళ్ల కూతురిని దారుణంగా చంపిన నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అలాగే అతడికి పెద్ద క్రిమినల్ మైండ్ ఉందని, వెంటనే కఠిన శిక్ష పడాలని కోరారు.