ఇక వదిలిపెట్టను.. క్షమాపణ చెప్పకపోతే కోర్టుకు లాగుతా.. సీఎం రేవంత్ పై కేటీఆర్ సీరియస్

ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తూ “డ్రగ్స్ కేసుతో నాకు సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయా? నా మీద ఎప్పుడైనా డ్రగ్స్ కేసు నమోదైందా?” అంటూ సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు. ఆరోపణలు చేయడం సులభం, కానీ దమ్ముంటే ఆధారాలు బయటపెట్టండి అని డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సీరియస్ కామెంట్స్
నేరుగా తన ముందు నిలబడి మాట్లాడే ధైర్యం లేక రేవంత్ ఢిల్లీలో చిట్‌చాట్‌లు చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఇది రేవంత్‌కు కొత్త కాదని, కానీ ఈసారి మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. “తప్పకుండా కోర్టులోకి లాగుతా, తప్పుడు ఆరోపణలకు రేవంత్ మూల్యం చెల్లించుకోవాల్సిందే” అని హెచ్చరించారు.

క్షమాపణ చెప్పాలి లేకపోతే పరిణామాలు తప్పవు
తనపై చేసిన ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని, లేకపోతే చట్టపరమైన పరిణామాలు తప్పవని కేటీఆర్ హెచ్చరించారు. కాగా, ఢిల్లీలో జరిగిన చిట్‌చాట్‌లో “కేటీఆర్ చుట్టూ ఉన్నవాళ్లంతా డ్రగ్స్ తీసుకున్నారు, విచారణలో నిజాలు బయటపడతాయి” అంటూ సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్, “నిజం ఉందని అనుకుంటే నిరూపించండి” అంటూ సవాల్ విసిరారు.

Leave a Reply