BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సంచలనం.. రాహుల్‌ గాంధీకి మద్దతు..!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన “ఓట్‌ చోరీ ఉద్యమం”కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు ప్రకటించారు. సిస్టమాటిక్‌ ఇంటెన్సివ్ రివ్యూ (SIR) తప్పనిసరిగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా సవరణకన్నా ముందుగా ఎన్నికల కమిషన్‌లోనే మార్పులు రావాల్సిన అవసరం ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

EC ప్రెస్‌మీట్‌లో సమాధానాల కంటే ఎక్కువ ప్రశ్నలు లేవనెత్తాయని ఆయన ఎద్దేవా చేశారు. సమాధానాలిచ్చే బదులు సాకులు చెప్పిందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన EC.. NDA విభాగంలా మారిందని సెటైర్లు వేశారు. ఎన్నికల కమిషన్ నియామక ప్రక్రియను తక్షణం సవరించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.

ఇక, కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో లక్షకు పైగా ఓట్లు దొంగిలించబడ్డాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. నకిలీ ఓటర్లు, తప్పుడు చిరునామాలు, ఒకే చిరునామాలో అనేక ఓటర్లు ఉన్న ఉదాహరణలు ఇందుకు ఆధారమని చెప్పారు. బెంగళూరులో జరిగినట్లుగానే, తక్కువ మెజారిటీతో బీజేపీ గెలిచిన 48 లోక్‌సభ స్థానాల్లో కూడా అక్రమాలు జరిగాయని రాహుల్ ఆరోపించారు.

బిహార్‌లో జరగనున్న ఎన్నికలకు ముందు, దాదాపు 65 లక్షల ఓట్లు తొలగించబడ్డాయని, ఇది ఓటు హక్కు దోపిడీ అని ఆయన పేర్కొన్నారు. ఈ ఆరోపణల మధ్యలోనూ రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.

అయితే, రాహుల్ ఆరోపణలను ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. ఏడు రోజుల్లోగా ప్రమాణపత్రంతో కూడిన ఆధారాలు సమర్పించాలని హెచ్చరించింది. లేకపోతే ఆయన ఆరోపణలను నిరాధారమైనవిగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. “ఓట్‌ చోరీ” అనే పదాన్ని వాడటం కోట్లాది భారతీయ ఓటర్లు, ఎన్నికల సిబ్బందిపై దాడి చేసినట్లేనని EC వ్యాఖ్యానించింది. ఒకే చిరునామాలో అనేక మంది ఉండడం లేదా ఇంటి నెంబర్ “0”గా ఉండడం నకిలీ ఓటర్ల నిర్ధారణ కాదని, డేటా విశ్లేషణలో తప్పులు ఉన్నాయని EC క్లారిటీ ఇచ్చింది.

ఇక, రాహుల్ గాంధీ బిహార్‌లోని ససారాం నుంచి 16 రోజుల పాటు 1300 కి.మీ.ల “వోటర్ అధికార్ యాత్ర” ప్రారంభించారు. ఈ యాత్రలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ కూడా పాల్గొన్నారు. ప్రజల్లో ఓటు హక్కు ప్రాధాన్యం, దాని రక్షణపై అవగాహన పెంచడమే ఈ యాత్ర లక్ష్యమని రాహుల్ గాంధీ తెలిపారు.

Leave a Reply