KTR: స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు తాము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) స్పష్టం చేశారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన, రాబోయే లోకల్ బాడీ ఎన్నికలు బీఆర్ఎస్‌కు ప్రీ ఫైనల్స్‌లా ఉంటాయని పేర్కొన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ పార్టీ (Congress Party) సక్రమంగా అమలు చేయలేదని ఆయన విమర్శించారు. తులం బంగారం, ఆడబిడ్డలకు స్కూటీలు కేవలం మాటలుగానే మిగిలిపోయాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని మెజారిటీ రైతులకు ఇప్పటి వరకు రుణమాఫీ అమలు కాలేదని, దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

మళ్లీ కేసీఆర్ (KCR) సీఎం కావాలంటే స్థానిక ఎన్నికలు అత్యంత కీలకమని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు ప్రజలు లోకల్ ఎలక్షన్లలో గట్టి బుద్ధి చెప్పాలని కోరారు. నిరుపేదలకు రేషన్ కార్డులు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యతే తప్ప, దాన్ని మంత్రులు ఘనకార్యంలా చెప్పుకోవడం తగదని ఆయన ఫైర్ అయ్యారు. రానున్న రోజుల్లో తాము మళ్లీ అధికారంలోకి వచ్చి, ప్రభుత్వంతో పాటు పార్టీకి కూడా సమన్యాయం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

Leave a Reply