ఈవీఎంలపై ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్న నేపథ్యంలో, భారత్‌లో మళ్లీ పేపర్ బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెెంట్ కేటీఆర్ కోరారు. మంగళవారం ఆయన నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయాన్ని కలిసింది.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. అమెరికా, యుకే, జర్మనీ, ఇటలీ వంటి దేశాలు ఈవీఎంలను ప్రయోగాత్మకంగా ఉపయోగించినప్పటికీ, నూతన అనుమానాల నేపథ్యంలో తిరిగి పేపర్ బ్యాలెట్ విధానంకు వెనుతిరిగినట్లుగా చెప్పారు. భారతదేశంలో కూడా ఈవీఎంలపై ప్రజల్లో పూర్తిస్థాయి నమ్మకం లేదని చెప్పారు.
ఈవీఎంలను తొలగించి
పేపర్ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని దేశ ఎన్నికల కమిషన్ కు మా పార్టీ తరపున విజ్ఞప్తి చేశాం.– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/hs1ntDEfrK
— BRS Party (@BRSparty) August 5, 2025
ఈ నేపథ్యంలో వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో ప్రారంభమై, తర్వాత జరిగే లోక్‌సభ ఎన్నికల వరకు పేపర్ బ్యాలెట్ పద్ధతినే అమలు చేయాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని కోరినట్లు వెల్లడించారు.
అంతేకాదు, బీఆర్ఎస్‌కు కేటాయించిన ‘కారు’ గుర్తుకు చాలా దగ్గరగా ఉన్న ఎనిమిది ఎన్నికల గుర్తుల వల్ల తమ పార్టీకి గతంలో చాలా నష్టం జరిగిందని, వాటిని వెంటనే తొలగించాలని ఈసీని కోరినట్లు తెలిపారు.
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు అడ్డగోలు హామీలు ఇస్తున్నాయంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిందని.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను పాటించని పార్టీపై ఎన్నికల సంఘమే చర్యలు తీసుకునే విధానం ఉండాలని, అవసరమైతే అలాంటి పార్టీలను ఎన్నికలపై అనర్హులుగా ప్రకటించాలంటూ ఈసీకి వినతి చేశామని తెలిపారు.