KTR: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. రూ.3 కోట్లకు గ్రూప్-1 ఉద్యోగాలు అమ్మారు..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. కంపెనీల నుంచి ముడుపులు వసూలు చేసి ఢిల్లీకి పంపడమే రేవంత్ పని అని వ్యాఖ్యానించారు. అనుముల రేవంత్ కాదు, ముడుపుల రేవంత్ రెడ్డి అని చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించారు. ప్రతి కంపెనీని ముడుపుల కోసం వేధిస్తున్నారని ఆరోపించారు.

L&T మెట్రో విషయంలో కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ముడుపుల కోసం వేధించడంతోనే హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌ను వదిలి వెళ్లిపోతామంటున్నారని అన్నారు. గతంలో L&T మెట్రో CFOను అరెస్ట్ చేస్తామని రేవంత్ బెదిరించారని కేటీఆర్ ఆరోపించారు.

రేవంత్ పాలన నియంత పాలనలా ఉందని మండిపడ్డ కేటీఆర్.. సీఎం ఒక్కరోజు కూడా సచివాలయానికి రావట్లేదని విమర్శించారు. రాష్ట్రంలో కాలేజీలు బంద్, ఆరోగ్యశ్రీ సేవలు రద్దు, యూరియ కొరత కొనసాగుతున్నాయని అన్నారు. అంగన్వాడీ వర్కర్లు, రేషన్ డీలర్ల ఆందోళనలు కొనసాగుతున్నా ప్రభుత్వం స్పందించలేదని ఫైరయ్యారు.

RRR అలైన్‌మెంట్ తమ ప్రభుత్వం ఉన్నప్పుడు రూపొందించామని, కానీ రేవంత్ సర్కార్ దాన్ని స్వప్రయోజనాల కోసం మార్చుతోందని ఆరోపించారు. దీంతో రైతులు భూములు కోల్పోతున్నారని అన్నారు. రాష్ట్రంలో 12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడినా సీఎంకు సమాచారం లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.

గ్రూప్-1 అవకతవకలపై కూడా కేటీఆర్ స్పందించారు. హైకోర్టు కూడా అవకతవకలు జరిగాయని గుర్తించిందని, రూ.3 కోట్లకు గ్రూప్‌-1 ఉద్యోగాలు అమ్మారని అభ్యర్థులే చెబుతున్నారని కేటీఆర్ తెలిపారు. ఇన్ని ఘోరాలు జరుగుతున్నా బీజేపీ మౌనంగా ఉందని, బీజేపీ-కాంగ్రెస్ ఒక్కటేనని వ్యాఖ్యానించారు. కనీసం గ్రూప్‌-1 అభ్యర్థులు, విద్యార్థులు రౌండ్‌టేబుల్ సమావేశం పెట్టుకోలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

తీన్మార్ మల్లన్న కొత్త పార్టీపై కూడా స్పందించిన కేటీఆర్.. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టే హక్కు ఉందన్నారు. ఎవరు కొత్త పార్టీ పెట్టినా స్వాగతిస్తామని చెప్పారు. పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి “కుడితిలో ఎలుకలా” మారిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మా పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేతల పరిస్థితి చూస్తే జాలి కలుగుతుందని అన్నారు.

కాంగ్రెస్ అధికారం రావడానికి పోరాడిన ప్రతి ఒక్కరు మోసపోయారని ఆరోపించారు. నిజంగా రాష్ట్రంలో అద్భుత పాలన ఉంటే వెంటనే ఉపఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు.

Leave a Reply