హైదరాబాద్‌లో కృష్ణాష్టమి వేడుకలు విషాదంలో ముగిశాయి. రామంతాపూర్ గోకులేనగర్‌లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఊరేగింపులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకృష్ణాష్టమి శోభాయాత్రలో రథం విద్యుత్ తీగలకు తగలడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు.
వివరాల్లోకి వెళితే.. రథాన్ని లాగుతున్న వాహనం మధ్యలో రిపేర్ కావడంతో, యువకులు చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో రథం పైభాగం విద్యుత్ తీగలకు తగలడంతో కరెంట్ షాక్ తగిలింది. ఒక్కసారిగా తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. మరొక నలుగురికి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
మృతులుగా గుర్తించబడిన వారు:
కృష్ణ యాదవ్ (21)
సురేశ్ యాదవ్ (34)
శ్రీకాంత్ రెడ్డి (35)
రుద్ర వికాస్ (39)
రాజేంద్ర రెడ్డి (45)
వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గన్‌మన్ శ్రీనివాస్ కూడా ఉన్నట్లు సమాచారం.