కొండాపూర్‌లో రేవ్ పార్టీపై మెరుపుదాడి.. భారీగా డ్రగ్స్ స్వాధీనం, 9 మంది అరెస్ట్

హైదరాబాద్‌ నగర శివారులో మరోసారి రేవ్ పార్టీ కలకలం రేపింది. కొండాపూర్‌లోని ఎస్వీ నిలయం అనే సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో అక్రమంగా నిర్వహించిన రేవ్ పార్టీపై ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో 9 మందిని అరెస్ట్ చేయగా, భారీగా మత్తు పదార్థాలు, విలాసవంతమైన కార్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొన్ని ముఠాలు వీకెండ్‌ సందర్భంగా నగరానికి డబ్బున్న వ్యక్తులను మారుపేర్లతో తీసుకొచ్చి, ఓ సర్వీస్ అపార్ట్‌మెంట్‌ను అడ్డాగా మార్చి రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీనిపై స్పందించిన ఎక్సైజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ బీటీం ఎస్సై సంధ్య, బాలరాజు తదితర అధికారులు దాడి నిర్వహించి పార్టీని భగ్నం చేశారు.

ఈ దాడిలో 2.080 కేజీల గంజాయి, 50 గ్రాముల ఓజీ కుష్ గంజాయి, 11.57 గ్రాముల మ్యాజిక్ మష్రూమ్, 1.91 గ్రాముల చరస్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా నాలుగు కార్లు, 11 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. అరెస్ట్‌ అయినవారిలో కింగ్ కెన్ షేర్, డ్రగ్స్ సరఫరాదారు రాహుల్, ఆర్గనైజర్ ప్రవీణ్ కుమార్ అలియాస్ మన్నే, అశోక్ కుమార్, సమ్మెల సాయి కృష్ణ, హిట్ జోసఫ్, తోట కుమార స్వామి, అడపా యశ్వంత్ శ్రీదత్, సమత, తేజలు ఉన్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మరో ముగ్గురు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారిపై కేసులు నమోదు చేసి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ రేవ్ పార్టీలో ఇతరుల హస్తం ఉందా? ఇంకా ఎవరెవరున్నారు అనే దానిపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Leave a Reply