Konda Surekha: మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు బిగ్ షాక్.. క్రిమినల్ కేసు నమోదు..!

తెలంగాణ రాష్ట్ర మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్న కొండా సురేఖకు నాంపల్లి కోర్టు ఊహించని తీర్పును ఇచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాలో కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

కేటీఆర్‌పై నిరాధార ఆరోపణలు చేసినట్టు పేర్కొంటూ, ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కోర్టు కూడా ఈ వాదనలతో ఏకీభవించింది. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, సమంత-నాగచైతన్య విడాకుల విషయంలో కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అసత్యంగా ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది.

కోర్టు తెలిపిన వివరాల ప్రకారం, కొండా సురేఖపై BNS సెక్షన్ 356 కింద క్రిమినల్ కేసు నమోదు చేయాలని, 2025 ఆగస్టు 21 లోపు ఆమెకు నోటీసు జారీ చేయాలని నాంపల్లి కోర్టు పోలీసులకు ఆదేశించింది.

కేటీఆర్ తరపు న్యాయవాది సిద్ధార్థ్ వాదనల మేరకు, సాక్షుల వాంగ్మూలాలు, డాక్యుమెంట్లు పరిశీలించిన అనంతరం కేసును పరిగణనలోకి తీసుకుంది కోర్టు. కొండా సురేఖ తరపున న్యాయవాది చేసిన అభ్యంతరాలను కోర్టు తోసిపుచ్చింది. ఫిర్యాదులో స్పష్టత లేదన్న వాదనలను కోర్టు పరిగణించలేదు.

ఇప్పటికే కొండా సురేఖ, కేటీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. ఈ పరువు నష్టం దావా కేసు ప్రాధాన్యత సంతరించుకుంది. డ్రగ్స్ వ్యవహారం, సెలబ్రిటీ విడాకులు వంటి విషయాలను రాజకీయంగా వాడుకుంటూ, తప్పుడు ఆరోపణలు చేయడం వల్ల తన ప్రతిష్ట దెబ్బతిన్నదని కేటీఆర్ కోర్టును ఆశ్రయించారు. దీనికి స్పందించని కొండా సురేఖపై న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.

Leave a Reply