అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది.

కోనసీమ జిల్లా: రాయవరం మండలం వెదురుపాక సావరం సమీపంలోని “లక్ష్మీ గణపతి బాణాసంచా తయారీ కేంద్రం”లో ఈ రోజు మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మందుగుండు తయారీ సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. క్షణాల్లోనే బాణాసంచా యూనిట్‌ను మంటలు చుట్టుముట్టాయి.

ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు సజీవదహనమయ్యారు, మరికొంత మంది తీవ్ర గాయాలతో తల్లడిల్లుతున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. చివరకు మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ, ప్రాణనష్టం విషాదాన్ని మిగిల్చింది.

ఈ బాణాసంచా కేంద్రాన్ని 40 ఏళ్ల అనుభవం కలిగిన ఎలుగుబంట్ల సత్తిబాబు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ పది మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారని తెలుస్తోంది.

ప్రభుత్వం స్పందన
ఈ ఘోర ప్రమాదంపై రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత (అనిత) సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, వారికి ప్రభుత్వ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులను ఆదేశించారు.
అలాగే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా ఘటనపై విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులు సూచించారు.

ఈ ఘటనతో రాయవరం పరిసర ప్రాంతాల్లో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు.
ప్రమాదానికి గల కారణాలు స్పష్టంగా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply