Kushboo: ఖుష్బూ సుందర్‌కు తమిళనాడు బీజేపీలో కీలక పదవి..!

బీజేపీ నేత, ప్రముఖ నటి ఖుష్బూ సుందర్‌కు తమిళనాడు బీజేపీలో కీలక బాధ్యత దక్కింది. ఆమెను రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమించారు. ఈ విషయాన్ని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించిన తమిళనాడు రాష్ట్ర కమిటీలో ఖుష్బూకు ఈ పదవి లభించింది.

ఈ కమిటీలో ఎం.చక్రవర్తి, వి.పి.దురైసామి, కె.పి.రామలింగం, కారు నాగరాజన్, శశికళ పుష్ప, కనకసబాపతి, డాల్ఫిన్ శ్రీధర్, ఎ.జి.సంపత్, పాల్ కనగరాజ్, జయప్రకాష్, వెంకటేశన్, గోపాల్సామి, ఎన్.సుందర్ తదితరులు ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు.

రాష్ట్ర సంస్థ ప్రధాన కార్యదర్శిగా కేశవ వినాయగన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా బాలగణపతి, రామ శ్రీనివాసన్, మురుగానందం, కార్త్యాయిని, ఏపీ మురుగానందం బాధ్యతలు స్వీకరించారు. కరాటే త్యాగరాజన్, అమర్ ప్రసాద్ రెడ్డి సహా మరికొంతమంది కార్యదర్శులుగా నియమితులయ్యారు.

సినిమా నుంచి రాజకీయాలవైపు ఖుష్బూ ప్రయాణం

ఖుష్బూ సుందర్ బాలనటిగా సినీ రంగంలో ప్రవేశించి దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. 185కి పైగా సినిమాల్లో నటించిన ఆమె, రజనీకాంత్, కమల్ హాసన్, మమ్ముట్టి, నాగార్జున, వెంకటేష్ వంటి ప్రముఖులతో స్క్రీన్ షేర్ చేశారు.

ఆమెకు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డులు, కలైమామణి అవార్డు, కేరళ రాష్ట్ర అవార్డులు లభించాయి. అభిమానులు గుడి కూడా కట్టించుకోవడం ఆమెకు లభించిన స్థాయిని చూపిస్తుంది.

2010లో డీఎంకేలో చేరిన ఆమె, 2014లో పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. అక్కడ జాతీయ ప్రతినిధిగా పనిచేశారు. 2020 అక్టోబర్‌లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2021లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా నియమితులయ్యారు.

2023లో కేంద్రం ఆమెను జాతీయ మహిళా కమిషన్ (NCW) సభ్యురాలిగా నామినేట్ చేసింది. 2024 ఆగస్టులో ఈ పదవికి రాజీనామా చేసి, పార్టీ కార్యకలాపాల్లో మరింతగా పాల్గొనాలని నిర్ణయించారు. ఆమె రాజకీయాల్లో ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ, బీజేపీలో మహిళా శక్తిగా, సినీ రంగం నుంచి వచ్చిన ప్రభావవంతమైన నేతగా కొనసాగుతున్నారు.

Leave a Reply