ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం భక్తులను ఆకట్టుకునేలా కన్నులపండువగా జరిగింది. ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమిచ్చిన గణనాథుడు, శోభాయాత్ర అనంతరం గంగమ్మ ఒడికి చేరి హుస్సేన్‌సాగర్‌లోని ఎన్టీఆర్ మార్గ్ వద్ద ప్రత్యేక క్రేన్ నంబర్ 4 సాయంతో నిమజ్జనం చేశారు.
నిమజ్జనానికి ముందు వేదపండితులు మహాగణనాథుడికి హారతి ఇచ్చి కలశపూజ నిర్వహించారు. 69 అడుగుల ఎత్తైన ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు విజయవాడ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన టస్కర్ భారీ ట్రాలీను ఉపయోగించారు. శోభాయాత్ర సాఫీగా సాగేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
చంద్రగ్రహణం కారణంగా ముందే నిమజ్జనం
భక్తుల జయజయధ్వానాల నడుమ నిమజ్జన కార్యక్రమం ఘనంగా ముగిసింది. ‘‘మళ్లీ రావయ్యా గణపయ్యా’’ అంటూ భక్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఈసారి చంద్రగ్రహణం కారణంగా సాధారణంగా జరిగే అనంత చతుర్దశి రోజుకు బదులుగా ఒక రోజు ముందుగానే నిమజ్జనం నిర్వహించారు.
మట్టితో ప్రతిష్టించిన 69 అడుగుల భారీ ఖైరతాబాద్ గణనాథుడిని ఈ సంవత్సరం దాదాపు 50 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని నిర్వాహకులు తెలిపారు.