Khairatabad Ganesh : బడా గణేష్ నవరాత్రుల్లో 930 మంది అరెస్ట్.. షీ టీమ్స్ కఠిన చర్యలు

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహా గణేశ్ మండపం వద్ద నవరాత్రుల సందర్భంగా భారీ రద్దీ కనిపించింది. అయితే ఈ భక్తి వాతావరణంలో ఆకతాయిలు రెచ్చిపోవడంతో మహిళా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారిపై షీ టీమ్స్ దాడి చేసి 9 రోజుల వ్యవధిలో మొత్తం 930 మందిని అరెస్ట్ చేశారు. గురువారం ఈ వివరాలను అధికారులు వెల్లడించారు.

అరెస్టైన వారిలో 55 మంది మైనర్లు కాగా, మిగతావారు మేజర్లేనని పోలీసులు తెలిపారు. గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో ఖైరతాబాద్ మహాగణపతి పరిసరాల్లో 15 మంది షీ టీమ్స్ సిబ్బందిని ప్రత్యేకంగా నిఘా కోసం ఏర్పాటు చేశారు. నిమజ్జనం సమయంలో ఎవరైనా మహిళలను వేధిస్తే వెంటనే డయల్‌ 100 కి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. ఇలాంటి వాటికి కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

నవరాత్రుల చివరి రోజు రద్దీ

నవరాత్రులు ముగుస్తుండటంతో మహా గణపతి దర్శనానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఖైరతాబాద్ పరిసరాలు రద్దీగా మారాయి. ముందస్తు నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా బడా గణేశ్ దర్శనానికి గురువారం రాత్రి 11 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న భక్తులను మాత్రమే అనుమతిస్తామని ఉత్సవ కమిటీ తెలిపింది. VIP దర్శనాలను నిలిపివేసి, క్యూలో ఉన్న వారినే అనుమతిస్తున్నారు.

ఈ ఏడాది రికార్డు స్థాయిలో భక్తులు ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్నారు. అయితే బుధవారం తోపులాట జరిగి పలువురు స్పృహ కోల్పోయిన ఘటన చోటుచేసుకుంది. భారీ రద్దీ దృష్ట్యా పోలీసులు కఠినమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

Leave a Reply