తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులకు పెద్ద ఉపశమనం లభించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సీబీఐ విచారణలో పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అక్టోబర్ 7న ప్రధాన పిటిషన్ విచారణ ఉండగా, అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని కేసీఆర్, హరీశ్ రావు తమ పిటిషన్లో కోర్టును కోరారు. ఈ వాదనలను విన్న న్యాయస్థానం, దసరా సెలవుల అనంతరం విచారణ కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
ఇక కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో జరిగిన అవకతవకలపై దర్యాప్తును సీబీఐకి అప్పగించినట్లు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల రూపకల్పన, నిర్మాణంలో NDSA గుర్తించిన లోపాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అంతరాష్ట్ర అంశాలు, కేంద్ర సంస్థల ప్రమేయం ఉన్నందున సీబీఐ దర్యాప్తే సముచితం అని స్పష్టం చేశారు.
పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా తదుపరి చర్యలపై హైకోర్టు తాత్కాలిక స్టే!
పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవొద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
అక్టోబర్ 7వ తేదీన ప్రధాన పిటీషన్ విచారణ ఉన్నందున… pic.twitter.com/aTEmzGKS0A
— Mission Telangana (@MissionTG) September 2, 2025
రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ లేదా సిట్ దర్యాప్తు చేపడుతుందని అనుకున్నారు. కానీ ఒకవేళ మాజీ సీఎం కేసీఆర్ అరెస్టు అయితే కక్షపూరిత చర్యలుగా ఆరోపణలు రావొచ్చనే భయంతోనే ఈ కేసును సీబీఐకి అప్పగించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
కవిత ఆరోపణలు
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌పై అవినీతి మరకలు పడటానికి హరీశ్ రావు, సంతోష్ రావులే కారణమని ఆమె ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో వారి స్వార్థ ప్రయోజనాలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయని అన్నారు. బీఆర్ఎస్ కొందరు చేసిన తప్పుల వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కేసీఆర్‌ను ప్రశ్నిస్తోందని కవిత వ్యాఖ్యానించారు. హరీశ్ రావు అక్రమాలకు పాల్పడిన కారణంగానే ఆయనను ఇరిగేషన్ శాఖ మంత్రి పదవి నుంచి తప్పించారని కూడా కవిత వ్యాఖ్యానించారు.