ఉప రాష్ట్రపతి ఎన్నికల విషయంలో బీఆర్‌ఎస్ పార్టీ తటస్థ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఎన్డీఏ, ఇండియా కూటమి అభ్యర్థుల్లో ఎవరికి మద్దతు ఇవ్వకుండా ఓటింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయానికి విరుద్ధంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డి గెలవాలని తన ఆకాంక్ష వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీల మద్దతు పొందిన అభ్యర్థి గెలవడం ప్రాంతీయ గర్వకారణమని కవిత అభిప్రాయపడ్డారు. పార్టీలకు అతీతంగా తెలంగాణకు చెందిన అభ్యర్థి గెలిస్తే వైస్ ప్రెసిడెంట్ పదవికి మరింత ప్రతిష్ట వస్తుందని పేర్కొన్నారు. రాజ్యాంగానికి అంకితభావంతో పనిచేసే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలవాలని కోరారు.
జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన కాళోజీ నారాయణరావు జయంతి వేడుకల్లో మాట్లాడిన కవిత, సామాజిక తెలంగాణ సాధనే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అన్ని వర్గాలకు అవకాశం, స్వేచ్ఛ, సంపద వచ్చేలా జాగృతి కృషి చేస్తుందన్నారు. కేసీఆర్ స్ఫూర్తితో సామాజిక తెలంగాణ సాధించే వరకు తమ కార్యకర్తలు విశ్రమించరని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పై కూడా కవిత తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన మల్లన్నసాగర్ నుంచే హైదరాబాద్ తాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని, కానీ 1,500 కోట్ల ప్రాజెక్ట్‌ను 7,500 కోట్లకు పెంచారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల సొమ్ము మెఘా కృష్ణారెడ్డికి లబ్ధి చేకూర్చేలా కుంభకోణం జరిగిందని మండిపడ్డారు.
గోదావరి ఫేజ్-2,3 పనుల అంచనాలు కూడా అమాంతం పెంచి, మెఘా కృష్ణారెడ్డి మరిన్ని ఆస్తులు కట్టుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని కవిత విమర్శించారు. ఇది రేవంత్ రెడ్డి వ్యక్తిగత సొమ్ము కాదని, రాష్ట్ర ప్రజల సొమ్మని కవిత ఘాటుగా వ్యాఖ్యానించారు. అంచనాలు ఎందుకు పెరిగాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.