తనను అధ్యక్షురాలిగా తొలగించి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను అధ్యక్షుడిగా నియమించడంపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో కార్మిక చట్టాలకు విరుద్ధంగా టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ సమావేశం నిర్వహించారని ఆమె ఆరోపించారు.
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఎన్నిక కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ పార్టీలో మరో చిచ్చురేపింది. పార్టీ ఆఫీస్‌లోనే ఈ ఎన్నిక జరపడం చట్ట విరుద్ధమని ప్రశ్నించారు. రాజకీయ కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని కవిత ఆరోపించారు. ఈ మేరకు కార్మికులకు లేఖ రాసిన ఆమె, గతంలో కేసీఆర్‌కు రాసిన లేఖను లీక్ చేశారంటూ కుట్రదారులపై మండిపడ్డారు. తనపై వ్యక్తిగత కక్షతోనే ఈ చర్యలు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
సింగరేణి కార్మికులకు రాసిన లేఖలో కవిత గత పదేళ్లుగా గౌరవాధ్యక్షురాలిగా సేవలందించడం తనకు గౌరవమని తెలిపారు. ప్రతి కార్మిక కుటుంబానికి ఒక సోదరిగా అండగా నిలిచానని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కార్మికుల సంక్షేమం కోసం పోరాటం కొనసాగించానని చెప్పారు.
తెలంగాణలోని నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న సింగరేణి బొగ్గు గని కార్మికులకు లేఖ రాసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు @RaoKavitha pic.twitter.com/wcivYFEiZ8
— Jagruthi Talks (@jagruthi_Talks) August 21, 2025
బీఆర్ఎస్ హయాంలోనే డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరింపజేసిన క్రెడిట్ తనదేనని కవిత గుర్తు చేశారు. తన కృషితో సింగరేణిలో 19,463 మందికి ఉద్యోగాలు వచ్చాయని, కార్మికుల క్వార్టర్స్‌కు ఉచిత కరెంట్, ఏసీ సౌకర్యం కల్పించానని తెలిపారు. కార్మికులకు ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్‌ను పది రెట్లు పెంచడంలో కూడా తన పాత్ర ఉందన్నారు. అంతేకాకుండా, ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన కార్మికుల పిల్లలకు ఫీ రీయింబర్స్‌మెంట్ అందేలా కృషి చేశానని గుర్తు చేశారు.
తాను గౌరవాధ్యక్షురాలిగా లేకపోయినా ప్రతీ కార్మికుడికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఉద్యమ నాయకురాలిగా అందించిన సేవల మాదిరిగానే ఇకముందు కూడా కార్మికుల కోసం పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.