Kavitha: కాళేశ్వరం మీద నమ్మకం.. కాంగ్రెస్‌పై లేదు: ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లు, కమిషన్ల కోసమే పనిచేస్తోందని ఎంఎల్‌సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చినట్టు కాదు, అది మొత్తం తెలంగాణకు ఇచ్చిన నోటీసులాంటిదని వ్యాఖ్యానించారు.

జాగృతి ఆధ్వర్యంలో జరిగిన మహా ధర్నాలో పాల్గొన్న కవిత, “90 శాతం పంప్ హౌస్‌లు కట్టిన మెఘా కృష్ణారెడ్డికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? కేసీఆర్ ఏ తప్పు చేశారు? ఆయనే తెలంగాణ భూములకు నీళ్లు అందించారు,” అని ప్రశ్నించారు.

కాళేశ్వరం = తెలంగాణ భవిష్యత్:
కవిత మాట్లాడుతూ “కాళేశ్వరం లేకుండా ఉంటే 35 శాతం తెలంగాణ ఎడారిగా మారేది. ఇప్పటికైనా మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేపట్టాలి. 40 టీఎంసీలతో హైదరాబాద్‌కు శాశ్వత నీటిసరఫరా అందించే ప్రాజెక్టు ఇది,” అని స్పష్టం చేశారు.

కాళేశ్వరం అంటే కేవలం మూడు బ్యారేజీలు కాదు:
ఈ ప్రాజెక్టులో 21 పంప్ హౌస్‌లు, 15 రిజర్వాయర్లు, 200 కిమీ టన్నెల్లు, 1500 కిమీ కాలువలు ఉన్నాయి. వాడిన స్టీల్‌తో 100 ఐఫిల్ టవర్లు, పోసిన కాంక్రీట్‌తో 50 బుర్జ్ ఖలీఫాలు కట్టవచ్చని వివరించారు.

కేసీఆర్ గట్టి గుండెతో చేసిన ప్రాజెక్టు ఇది:
“కాంగ్రెస్ నేతలకు కలలో కూడా ఇంత పెద్ద ప్రాజెక్టును కట్టాలన్న ఆలోచన రావు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలో ఉన్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు కేవలం 16 టీఎంసీలు మాత్రమే రావాల్సింది. కేసీఆర్ దాన్ని 141 టీఎంసీలకు పెంచారు,” అని కవిత పేర్కొన్నారు.

రేవంత్‌, కేంద్రం, బీజేపీపై తీవ్ర విమర్శలు:
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు 200 టీఎంసీల నీటిని బనకచర్లకు ఎత్తుకెళ్తామని ప్రకటిస్తుంటే… తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. “తుపాకులగూడెం వద్దే గోదావరి-పెన్నా లింకేజ్ పాయింట్ ఉండాలని కేంద్రాన్ని కోరేలా తక్షణమే రేవంత్ లేఖ రాయాలి,” అని డిమాండ్ చేశారు. చంద్రబాబుపై ఆధారపడే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని అందువల్లే జల దోపిడి చేస్తున్నా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఒక్క మాట మాట్లాడటం లేదన్నారు.

బీజేపీ మౌనం.. ఈటల నిశ్శబ్దం:
“బీజేపీలో తెలంగాణ బిడ్డ ఈటల రాజేందర్ మాత్రమే. ఆయన కూడా మాట్లాడడం లేదు. పదవుల కోసం పెదవులు మూసుకోకండి” అని వ్యాఖ్యానించారు.

తొలగించలేని నిజం – కేసీఆర్ కృషి:
కవిత స్పష్టంగా పేర్కొన్నది – “కాళేశ్వరం వల్లనే తెలంగాణకు 40 లక్షల ఎకరాల భూమికి నీరందుతుంది. ఇది కేసీఆర్ గొప్పతనం. ఆయనను బద్నాం చేయాలన్నే ఉద్దేశంతోనే కమిషన్ పెట్టారు. తెలంగాణ పౌరుషాన్ని చాటే సమయం ఇది. గోదావరి నుంచి వెయ్యి టీఎంసీల హక్కు కోసం తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది.”

Leave a Reply