Kavitha : కవితకు బీఆర్‌ఎస్ షాక్.. పార్టీ నుంచి సస్పెన్షన్, కొత్త పార్టీ ప్రచారం..!

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ షాక్ తగిలింది. పార్టీ నుంచి ఆమెను అధికారికంగా సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్‌ఎస్ ప్రకటించింది. కవిత ప్రవర్తన పార్టీకి నష్టం కలిగించేలా ఉందని బీఆర్‌ఎస్ నేతలు స్పష్టం చేశారు.

సోమవారం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై కవిత సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్, మేఘా కృష్ణారెడ్డిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టులో కేసీఆర్‌కే అవినీతి మరక అంటించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కవితపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బీఆర్‌ఎస్ అధికారిక ప్రకటనలో.. “కవిత ఇటీవల ప్రవర్తిస్తున్న తీరు, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు బీఆర్‌ఎస్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయి. అందువల్ల ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం” అని పేర్కొన్నారు.

ఇక కవిత తర్వాత రాజకీయ అడుగు ఏమిటన్నదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆమె కొత్త పార్టీ స్థాపనకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ జాగృతి పేరుతో లేదా తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి (TBRS) పేరుతో కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. పాత టీఆర్‌ఎస్ పేరునే మళ్లీ తీసుకురావచ్చని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మొత్తానికి కవిత సస్పెన్షన్ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారం రేపుతోంది.

Leave a Reply