శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ఉదయం తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. కార్తీక మాసం సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు దర్శనానికి తరలివచ్చారు. ఉదయం ప్రత్యేక దర్శనానికి ఏర్పాట్లు కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా గుంపు ముందుకు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది.
స్థానికులు, పోలీసులు గాయపడిన వారిని తక్షణమే సమీప ఆసుపత్రులకు తరలించారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. ఘటన స్థలంలో ఉద్రిక్తత నెలకొంది.
అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఆలయ పరిసర ప్రాంతంలో భద్రతా బలగాలను మోహరించారు.
ఈ ఘటన పట్ల రాష్ట్ర ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కర్తీక మాస పర్వదినం సందర్భంగా ఇలాంటి దుర్ఘటన జరగడం దురదృష్టకరమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
