ACB Raids : ఏసీబీకి దొరికిన పంచాయతీ కార్యదర్శి.. ఊరంతా పండగ వాతావరణం!

కొద్దిరోజులుగా అవినీతిపరులపై ఏసీబీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడుతున్న ఉద్యోగులు ఎంతైనా మారుతారని అనుకున్నారు కానీ ఇంకా కొంతమంది ప్రభుత్వ సిబ్బంది అవినీతి ఆగడం లేదు. తాజాగా కరీంనగర్ జిల్లాలో ఓ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. దీంతో అతని అవినీతి వల్ల ఇబ్బందులు పడ్డ గ్రామస్థులు పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కొత్తగా కట్టుకున్న ఇంటికి నెంబర్ ఇవ్వాలంటే 20 వేల రూపాయలు లంచం ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి నాగరాజు బలవంతం చేశాడు. బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేయగా, అధికారులు పక్కా ప్లాన్ వేసి, లంచం తీసుకుంటూ ఉండగా నాగరాజును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఈ విషయం తెలుసుకున్న స్థానికులు సంబరాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి, ఊరంతా పండగ వాతావరణం నెలకొంది. నాగరాజు రోజూ లంచాలతో వేధించేవాడని గ్రామస్థులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఎవరైనా అధికారుల లంచం డిమాండ్ చేస్తే 1064 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని, బాధితుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు.

ఇక మరోవైపు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరరావు నివాసంలో ఏసీబీ అధికారులు భారీ సోదాలు చేపట్టారు. హనుమకొండ చైతన్యపురిలోని ఆయన ఇల్లు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. సుమారు రూ.5 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. వీటిలో రూ.1.15 కోట్ల విలువైన ఇంటి పత్రాలు, రూ.1.42 కోట్ల విలువైన 17 ఎకరాల వ్యవసాయ భూమి, రూ.23.84 లక్షల విలువైన 70 తులాల బంగారం, రూ.92 వేల విలువైన 1.7 కిలోల వెండి వస్తువులు, రూ.34.78 లక్షల విలువైన 6 వాహనాలు, రూ.3.28 లక్షల విలువైన ఖరీదైన గడియారాలు ఉన్నాయి. నాగేశ్వరరావు గతంలో హసన్‌పర్తి, ధర్మసాగర్, కాజీపేట మండలాల్లో తహసీల్దార్‌గా పనిచేశారు.

Leave a Reply