Kamareddy : వరదలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి

ఇటీవల కురిసిన వర్షాలు కామారెడ్డి, మెదక్ జిల్లాలను అతలాకుతలం చేశాయి. ఈ నేపథ్యంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీశాయి. ఆయన మాట్లాడుతూ.. “ప్రజల అతి విశ్వాసంతోనే ఈ వరదల్లో చిక్కుకున్నారు. విపత్తుల సమయంలో ప్రభుత్వం, నాయకులు ఏమీ చేయలేరు. ప్రజలే అప్రమత్తంగా ఉండాలి” అని అన్నారు.

వర్షాల సమయంలో వరదలు తక్కువగా ఉన్నప్పుడే ప్రజలు బయటకు వచ్చి ఉంటే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల తప్పిదం, అలాగే ఆక్రమణలే ఈ పరిస్థితికి కారణమని పేర్కొన్నారు.

అదే సమయంలో, అధికారులు, ఎమ్మెల్యేలు కనిపించడం లేదని సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న పోస్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఓటు వేసినందుకు నాయకులు వారి ముడ్డి కడగాలా? అది సాధ్యం కాదు” అంటూ ఘాటుగా స్పందించారు. వరదల సమయంలో కామారెడ్డిలోని పలు ప్రాంతాలను తాను పర్యటించానని, కానీ ఫోటోలకు పోజులు ఇవ్వలేదని తెలిపారు.

మూడుగంటల వ్యవధిలో కురిసిన కుండపోత వర్షం కారణంగా చెరువులు పొంగిపోయాయని, కట్టలు తెగిపోయాయని ఆయన వివరించారు. ఊహించని విధంగా నష్టం జరిగినప్పటికీ, అధికారులతో కలిసి తాను కష్టపడి పనిచేశానని అన్నారు.

అయితే, కొంతమంది సోషల్ మీడియాలో తీవ్ర కామెంట్లు చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలే తప్ప, ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి స్పష్టం చేశారు. “వరదల్లో నేను ఏం చేశానో బాధితులకే తెలుసు” అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

Leave a Reply