Telangana Floods: కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో ఘోర పరిస్థితి.. మరో రెండు జిల్లాల్లోనూ డేంజర్‌

అల్పపీడన ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు కామారెడ్డి, మెదక్‌, నిర్మల్‌ జిల్లాల్లో విస్తృతంగా భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్‌ జిల్లాలు ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. వాతావరణశాఖ హెచ్చరిక ప్రకారం గురువారం కూడా మెదక్‌, నిర్మల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తెలంగాణలో పలు చోట్ల వర్షపాతం తీవ్ర స్థాయిలో నమోదైంది. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండలో 43.1 సెంటీమీటర్లతో అత్యధిక వర్షం కురిసింది. నిర్మల్‌ జిల్లా అక్కాపూర్‌లో 32.3 సెంటీమీటర్లు, మెదక్‌ జిల్లా సర్దానలో 30.2 సెంటీమీటర్లు, కామారెడ్డి పట్టణంలో 28.9 సెంటీమీటర్లు, భిక్కనూర్‌లో 27.9 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. నిర్మల్‌ జిల్లా వడ్యాల్‌లో 27.9 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో 27.5 సెంటీమీటర్లు, మెదక్‌ జిల్లా నాగాపూర్‌లో 26.6 సెంటీమీటర్లు, పాత రాజంపేటలో 24.6 సెంటీమీటర్లు, లింగంపేటలో 22.5 సెంటీమీటర్లు, దోమకొండలో 20.2 సెంటీమీటర్లు, విశ్వనాథ్‌పేట్‌లో 24.1 సెంటీమీటర్లు, ముజిగిలో 23.1 సెంటీమీటర్లు, చేగుంటలో 20.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

భారీ వర్షాల దృష్ట్యా కామారెడ్డి, మెదక్‌ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. కామారెడ్డిలో కురిసిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పంట పొలాలు, నివాస ప్రాంతాలు చెరువులను తలపించాయి. కామారెడ్డి-భిక్కనూర్‌ రైలు మార్గంలో ట్రాక్‌ కింద పెద్ద గండిపడటంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

జిల్లా కేంద్రంలో వాగు పొంగిపొర్లడంతో కార్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. హౌసింగ్‌ బోర్డు కాలనీలో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అధికారులు కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలకు గురువారం సెలవులు ప్రకటించారు.

వరదల ప్రభావిత ప్రాంతాలపై సీఎం రేవంత్‌ రెడ్డి ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో నేటి పరీక్షలు వాయిదా వేశారు. శుక్రవారం నుంచి యథాతథంగా పరీక్షలు జరుగుతాయని వీసీ యాదగిరి రావు స్పష్టం చేశారు.

Leave a Reply