కల్తీ కల్లు ఘటనపై మంత్రి జూపల్లి సంచలన వ్యాఖ్యలు.. బాధ్యులపై క్రిమినల్ కేసులు..!

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో కల్తీ కల్లు తాగి ముగ్గురు మృతి చెందగా, పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 15 మంది బాధితులను పరామర్శించిన ఆయన, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జూపల్లి, “ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే వారెవ్వరైనా, ఎంత పెద్దవారైనా సరే వదిలిపెట్టం” అని తీవ్ర హెచ్చరిక చేశారు.

ఈ సంఘటనపై ఎక్సైజ్ శాఖ మరియు పోలీసు శాఖ కేసు నమోదు చేసి, బాధ్యులను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నట్టు మంత్రి తెలిపారు. కల్లు డిపోలపై దాడులు నిర్వహించి, కల్తీ కల్లు నమూనాలను ఎక్సైజ్ కెమికల్ ల్యాబ్‌కు, బాధితుల శరీర నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు వెల్లడించారు.

“నివేదికల ఆధారంగా బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు, డిపోల లైసెన్సులు రద్దు చేస్తాం,” అని ఆయన స్పష్టం చేశారు.

ఈ ఘటనలు మరల జరగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి కల్లు డిపోలపై నిరంతర నిఘా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, నెఫ్రాలజీ విభాగాధిపతి డా. గంగాధర్ తదితరులు ఆయనతో పాటు ఉన్నారు.

ఇప్పటికే కల్తీ కల్లు తాగటం వల్ల పరిస్థితి విషమించి ముగ్గురు మరణించారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన ఎక్సైజ్ శాఖ, మరో ముగ్గురిపై కేసులు నమోదు చేసింది. 15 మంది నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఇంకా కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Leave a Reply