CM Revanth Reddy : సీబీఐకి కాళేశ్వరం కేసు.. రేవంత్ స్కెచ్‌పై రాజకీయ హీట్

కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) లో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ఆరోపణల నేపథ్యంలో, ఈ కేసును సీబీఐ (CBI) కి అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అసెంబ్లీలో ప్రకటించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్రణాళిక, రూపకల్పన, నిర్మాణంలో చోటుచేసుకున్న అవకతవకలపై NDSA గుర్తించిన అంశాలు, కమిషన్ ఇచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం తెలిపారు. అయితే, ఈ విచారణను సీబీఐకి అప్పగించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి.

ఈ ప్రాజెక్టుతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అనేక కేంద్ర సంస్థలు, బ్యాంకులు, అంతర్రాష్ట్ర వ్యవహారాలు ముడిపడి ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర పోలీసు లేదా స్థానిక సంస్థలు దర్యాప్తు చేస్తే అది నిష్పాక్షికంగా సాగకపోవచ్చని, రాజకీయ వివాదాలకు దారితీయవచ్చని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. సీబీఐ పరిధిలోకి వెళ్లడం వల్ల దేశవ్యాప్తంగా కేసుపై దృష్టి సారించబడుతుందని, మరింత సమగ్ర విచారణ జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇక బీజేపీ (BJP) చాలా కాలంగా కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తు సీబీఐకే అప్పగించాలని డిమాండ్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు కేసు సీబీఐకి వెళ్లడం వల్ల, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీని నెరవేర్చిందన్న సందేశం వెళ్లవచ్చు. అలాగే, సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, కేసీఆర్ (KCR) పై తాము కక్ష్యపూరితంగా వ్యవహరించలేదని కాంగ్రెస్ చెప్పుకోగలదు.

బీఆర్ఎస్ అలర్ట్

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో బీఆర్ఎస్ (BRS) అప్రమత్తమైంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ తో హరీశ్ రావు, కేటీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో సమావేశమై భవిష్యత్ వ్యూహంపై చర్చిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, కాళేశ్వరం రిపోర్టు విషయంలో ఇప్పటికే కేసీఆర్, హరీశ్ రావు హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్ రేపు విచారణకు రానుంది.

ఈటల విమర్శ

పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు తప్పుల తడక అని, అది నిలవదని మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేతగాక సీబీఐకి అప్పగించిందని విమర్శించారు. అయితే, ఇప్పుడు అయినా సీబీఐ విచారణకు అప్పగించడం సరికొత్త ముందడుగే అని ఈటల వ్యాఖ్యానించారు. కాగా, 2022లో సీబీఐ తెలంగాణలో విచారణ జరపకుండా అడ్డుకున్నదీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా గుర్తుచేశారు.

Leave a Reply