కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నివేదికలో పేర్కొన్న అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని కోరుతూ, కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి లేఖ పంపింది.
ఆదివారం అసెంబ్లీలో జరిగిన చర్చ అనంతరం, ఈ వ్యవహారాన్ని సీబీఐ దర్యాప్తుకు అప్పగిస్తూ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసింది. అనంతరం రాష్ట్ర హోం శాఖ, ముఖ్యమంత్రి ఆమోదం తర్వాత, కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖను పంపినట్లు సమాచారం.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనుల్లో భారీ అక్రమాలు జరిగాయని, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని స్పష్టం చేసింది. జూలై 31న సమర్పించిన నివేదికలో అనేక లోపాలు, అవకతవకలను ప్రస్తావిస్తూ, అవసరమైతే క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవచ్చని సూచించింది.
ఇదే అంశంపై గతంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథార్టీ (NDSA) కూడా నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. మేడిగడ్డ బ్యారేజి వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్, నాణ్యత లోపాలే కారణమని పేర్కొంది. ఈ రెండు నివేదికల ఆధారంగా మరింత లోతైన దర్యాప్తు అవసరమని ప్రభుత్వం తేల్చింది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ శాఖల ప్రమేయం ఉన్నందున సీబీఐ దర్యాప్తు తప్పనిసరని స్పష్టం చేశారు. శాసనసభ తీర్మానం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం లేఖను కేంద్రానికి పంపినట్లు వెల్లడించారు.
సీబీఐ దర్యాప్తు ఆమోదమిస్తే, కుంగిన మేడిగడ్డ బ్యారేజి నిర్మాణం, చెల్లించిన బిల్లులు, మొత్తం ఎవరికి చేరిందనే విషయాలపై మళ్లీ విచారణ జరుగనుంది. అదేవిధంగా కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (KIDC) పై కూడా సీబీఐ దర్యాప్తు చేయాలని కమిషన్ సిఫార్సు చేసింది.
ప్రధాన సిఫార్సులు:
మేడిగడ్డలో కుంగిన బ్లాక్ పునర్నిర్మాణ ఖర్చు నిర్మాణ సంస్థే భరించాలి.