కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ చంద్రఘోష్ కమిటీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది. ఈ నివేదికను క్యాబినెట్‌లో ఆమోదించి రేపు శాసనసభలో ప్రవేశపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సమయంలోనే అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మరోసారి హైకోర్టును ఆశ్రయించి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.
జస్టిస్ చంద్రఘోష్ కమిటీ నివేదికను సస్పెండ్ చేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో ఆ నివేదికను ప్రవేశపెట్టకుండా ఆపాలని తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. గతంలోనూ మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావు ఇదే అంశంపై పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులను హైకోర్టు వాయిదా వేసి అక్టోబర్‌లో విచారణకు పెట్టింది.
సభ వాయిదా అనంతరం మీడియా పాయింట్‌లో హరీశ్ రావు మాట్లాడుతూ, “కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? వాస్తవాలను వినడానికి సిద్ధంగా లేరా?” అని ప్రశ్నించారు. మంత్రి శ్రీధర్ బాబు వాస్తవాలు వినకుండా విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పులు జరిగాయా లేదా అనేది తేల్చేది కాంగ్రెస్ పార్టీ కాదు, కోర్టులు మరియు ప్రజలేనని హరీశ్ రావు స్పష్టం చేశారు.
ఇకపోతే, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై కూడా గతంలో కేసీఆర్, హరీశ్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. ఆ కమిషన్‌కి విచారణ చేసే అర్హతే లేదని, అందుకే ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వ అవసరాలకనుగుణంగానే ఆ నివేదికను తయారు చేశారని వారు ఆరోపించారు. దీంతో నివేదికపై స్టే ఇవ్వాలని కోరిన పిటిషన్లపై హైకోర్టు అక్టోబర్‌లో విచారణ చేపట్టనుంది.