కడప జిల్లాలోని శ్రీ చైతన్య స్కూల్ హాస్టల్లో మరో విషాదం చోటుచేసుకుంది. 9వ తరగతి విద్యార్థిని జశ్వంతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో ప్రాంతమంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
విద్యార్థిని మృతదేహాన్ని తల్లిదండ్రులకు సరైన సమాచారం ఇవ్వకుండా నేరుగా రిమ్స్ ఆసుపత్రికి తరలించిందని స్కూల్ యాజమాన్యంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్చురీలో జశ్వంతి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.
తమ బిడ్డ ఆత్మహత్యకు స్కూల్ యాజమాన్యమే కారణమంటూ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్లో ఒత్తిడి, ప్రవర్తన, లేదా ఇతర కారణాలపై పోలీసులు విచారణ జరపాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.
మార్చురీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతదేహాన్ని శ్రీ చైతన్య స్కూల్ వద్దకు తీసుకెళ్లి అక్కడే ధర్నా చేయాలని కుటుంబ సభ్యులు, బంధువులు ప్రయత్నించారు. కానీ పోలీసులు ఆసుపత్రి గేటు వద్ద వారిని అడ్డుకున్నారు.
స్కూల్ వద్దకు ఎవరినీ వెళ్లనీయకుండా గేట్లు మూసివేయడంతో అక్కడ కూడా ఉద్రిక్తత చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసుల తీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు.
జశ్వంతి ఆత్మహత్యకు కారణాలు ఏంటి? స్కూల్లో ఏమైనా ఒత్తిడి ఉందా? అనే అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని తల్లిదండ్రులు, బంధువులు కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
