జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: టికెట్ వాళ్ళకే అంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్..!

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి టికెట్‌ను పూర్తిగా స్థానికులకే ఇవ్వనున్నట్టు ప్రకటించారు. పార్టీ అభ్యర్థిని ఖరారు చేసేముందు అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. “బయట నుంచి వచ్చే వారిని పరిగణనలోకి తీసుకోవడం లేదు” అని ఆయన స్పష్టం చేశారు.

ఇటీవల BRS ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంలో ఉపఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. దీంతో ఈ స్థానం కోసం ప్రధాన రాజకీయ పార్టీలు బరిలో దిగేందుకు సన్నద్ధమవుతున్నాయి. కాంగ్రెస్, BRS, బీజేపీ మూడు పార్టీలు ఈ సీటుపై దృష్టి సారించాయి.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోయింది. అయితే కంటోన్మెంట్ ఉపఎన్నికలో బీజేపీని వీడి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన శ్రీగణేష్ విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీకి ఊపునిచ్చింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో కాంగ్రెస్ మరో అవకాశం అందుకుంటుందా? అన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ కోసం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. దాదాపు 10 మంది ఆశావహులు ఇప్పటికే టికెట్ కోసం అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.

Leave a Reply