Jr.NTR Fans: ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన Jr. NTR అభిమానులు

టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల లీకైన ఓ ఆడియోలో ఎమ్మెల్యే ప్రసాద్‌ జూనియర్ ఎన్టీఆర్, ఆయన తల్లి శాలినీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు రావడంతో వివాదం ముదిరింది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఆదివారం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇంటిని అభిమానులు ముట్టడించేందుకు యత్నించారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని ఎన్టీఆర్ అభిమాన సంఘాలు పిలుపునిచ్చాయి. ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అభిమానులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పలువురు అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

అభిమానులు ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం “చలో అనంతపురం” కార్యక్రమం కూడా నిర్వహించారు. దీంతో పోలీసులు అప్రమత్తమై ఎమ్మెల్యే ఇంటి చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి మార్గాలను మూసివేశారు. పామిడి వద్దకు చేరుకున్న అభిమానులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పెరిగింది.

ఈ ఘటనతో టీడీపీ అధిష్టానానికి కూడా ఇబ్బందులు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. “పార్టీలో అంతర్గత విభేదాలు, అనవసర వివాదాలు సహించబోమని” ఆయన స్పష్టం చేసినట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం ఈ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ అభిమానుల నిరసనలపై జూనియర్ ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply