శ్రీకాళహస్తికి చెందిన యువకుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసులో మిస్టరీ వీడింది. ఇటీవల చెన్నై సమీపంలో ఆయన మృతదేహం లభ్యం కావడంతో కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ హత్యకేసులో చెన్నై పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టుల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గానికి జనసేన పార్టీ ఇంచార్జిగా ఉన్న వినుత కోటా, ఆమె భర్త చంద్రబాబు, మరి ఇంకొద్ది మంది వ్యక్తులు ఉన్నారు.
పోలీసుల దర్యాప్తు ప్రకారం, మృతుడు శ్రీనివాసులు గతంలో వినుత వద్ద డ్రైవర్‌గా, పీఏగా పనిచేశాడు. రెండు వారాల క్రితమే అతనిని విధుల నుండి తొలగించినట్లు తెలుస్తోంది. జూన్ 21న వినుత బహిరంగంగా ప్రకటన చేస్తూ – శ్రీనివాసుతో ఇకపై తమకు ఎలాంటి సంబంధం లేదని, అతను ద్రోహం చేశాడని ఆరోపించారు.
శ్రీకాళహస్తి జనసేన ఇంఛార్జ్ కోటా వినుత దంపతులు అరెస్ట్
– డ్రైవర్ శ్రీనివాసులు హత్య కేసులో వినుత దంపతుల అరెస్ట్
– చెన్నైలోని కూవం నదిలో శ్రీనివాసులు మృతదేహం లభ్యం
– హత్య కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసిన చెన్నై పోలీసులు
– అరెస్ట్ అయిన వారిలో జనసేన నేత కోటా వినుత దంపతులు pic.twitter.com/FbBVkPRsNi— వై.యస్.ఆర్ కుటుంబం™ (@_Ysrkutumbam) July 12, 2025
చెన్నై మింట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కూవం నదిలో మూడు రోజుల క్రితం గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడి చేతిపై ఉన్న జనసేన సింబల్, వినుత పేరు ఆధారంగా పోలీసులు ఈ కేసును తవ్వి తేల్చారు. విచారణలో జులై 8న హత్య జరిగి మృతదేహాన్ని నదిలో పడేశారనే అంశాలు వెలుగులోకి వచ్చాయి.
నిందితులను శ్రీకాళహస్తికి తీసుకొచ్చి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. హత్యకు గల అసలైన కారణం ఇంకా తెలియరాలేదు కానీ, రాజకీయ సంబంధాలు, వ్యక్తిగత విభేదాల కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.