Jagga Reddy: నువ్వు దేవుడు సామీ.. లైవ్‌లో 3 లక్షల సాయం చేసిన జగ్గారెడ్డి..!

సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎప్పుడూ తన ప్రత్యేకమైన స్టైల్‌తో వార్తల్లో నిలుస్తుంటారు. రాజకీయాలకే పరిమితం కాకుండా, ఆయన సేవా కార్యక్రమాలపైనా విపరీతమైన శ్రద్ధ చూపుతున్నారు. ముఖ్యంగా క్యాన్సర్ బాధితులకు సహాయం చేస్తూ, వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. తాజాగా, తీవ్ర అనారోగ్యంతో 9 ఏళ్లుగా బాధపడుతున్న చిన్నారి సుష్మకు 3 లక్షల రూపాయల సాయం చేసి, లైవ్‌లో ప్రకటించారు. అంతేకాక, హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తానని హామీ ఇచ్చారు.

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ గ్రామానికి చెందిన సుష్మ చిన్న వయసులో జరిగిన ప్రమాదంతో ఆరోగ్యం కోల్పోయింది. తొమ్మిదేళ్ల క్రితం దసరా సందర్భంగా అమ్మమ్మ ఇంట్లో పొరపాటున చీమల మందు కలిపిన ఆహారం తినడం వల్ల ఆమె అనారోగ్యానికి గురైంది. అప్పటి నుంచి మంచానికే పరిమితమైంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సరైన వైద్యం అందించలేకపోతున్నామని ఆమె తండ్రి చెవుగాని మహేష్ బాధ వ్యక్తం చేశారు.

ఇటీవల ఈ విషయం మీడియా ద్వారా తెలిసిన జగ్గారెడ్డి వెంటనే స్పందించారు. చిన్నారి తండ్రి మహేష్‌ను పిలిపించి, వైద్యులతో మాట్లాడి అవసరమైన అన్ని పరీక్షలు చేయాలని సూచించారు. సర్జరీ అవసరం అయితే మరింత సహాయం చేస్తానని, అలాగే సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి ప్రభుత్వ సహాయం కూడా అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఇంకా ఇతర దాతలు కూడా ముందుకు వచ్చి సాయం చేయాలని కోరారు.

ఆర్థిక సహాయం చేయదలచినవారు నేరుగా చిన్నారి తండ్రి మహేష్ (ఫోన్: 9553461480) ను సంప్రదించాలని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply