Singaiah Case: సింగయ్య మృతి కేసు.. జగన్ క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా

పల్నాడు జిల్లా రెంటపాళ్ల గ్రామంలో జరిగిన సంఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. గ్రామంలో జరిగిన పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి మృతి చెందగా, ఈ ఘటనకు జగన్ వాహనం కారణమైందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై తనపై నమోదైన కేసును రద్దు చేయాలంటూ జగన్ బుధవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై విచారణను హైకోర్టు నేటికి వాయిదా వేసింది. ఈరోజు తిరిగి విచారణ చేపట్టిన ధర్మాసనం, క్వాష్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో నిందితులపై ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోరాదని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 1కి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు.

ఈ కేసులో జగన్‌తో పాటు ఆయన డ్రైవర్ రమణారెడ్డి, వ్యక్తిగత సహాయకుడు నాగేశ్వరరెడ్డి, వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజనిని కూడా నిందితులుగా చేర్చారు. వీరంతా హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేయగా, అన్ని పిటిషన్లపై హైకోర్టు ఈ రోజు సంయుక్తంగా విచారణ చేపడుతోంది.

గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ గతంలో మీడియాతో మాట్లాడుతూ, సింగయ్య జగన్ వాహనం కింద పడినట్లుగా స్పష్టమైన సీసీ టీవీ ఫుటేజ్, డ్రోన్ దృశ్యాలు, ప్రత్యక్ష సాక్షుల వీడియో ఆధారంగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Leave a Reply