YS Jagan: ఇది అరటి తొక్క కాదు జగన్.. ఎస్‌ఐ సుధాకర్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్..!

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. “పోలీసులు రెచ్చిపోతే, అధికారంలోకి వచ్చాక బట్టల ఊడదీసి కొడతాం” అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై, శ్రీసత్యసాయి జిల్లా రామగిరి ఎస్‌ఐ సుధాకర్ యాదవ్ బహిరంగంగా కౌంటర్ ఇచ్చారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అవుతోంది.

ఎస్‌ఐ సుధాకర్‌ మాట్లాడుతూ, “ఇదేమైనా అరటి తొక్క అనుకున్నారా జగన్ గారు? మేము వేసుకున్న యూనిఫాం మీ మంత్రివర్గం సిఫారసుతో రాలేదు. వందలాది మంది మధ్య పోటీ పడి, ఎంతో కష్టపడి సాధించుకున్న హక్కు ఇది. పోలీసులుగా మేము ప్రజల కోసం పనిచేస్తాం, పార్టీ ఆదేశాలకోసం కాదు” అని ఘాటుగా వ్యాఖ్యానించారు. “మీరు ఊడదీసి కొడతానంటారా? ముందు ఆ మాటల తీరును సరిచేసుకోండి. మేము నిజాయితీతో జీవించాలనుకుంటాం, అడ్డదారులు తొక్కమన్నా ఒప్పుకోవడం లేదు” అని స్పష్టం చేశారు.

ఈ వ్యాఖ్యల నేపథ్యాన్ని వివరిస్తూ, గత నెల రామగిరిలో జరిగిన ఎంపీపీ ఎన్నికల సమయంలో జరిగిన ఘటనలను గుర్తు చేశారు. “ఆ ఎన్నికల్లో మేము చట్టబద్ధంగా బందోబస్తు ఏర్పాటు చేశాం. అయినప్పటికీ ఎంపీటీసీలను రామేశ్వరం తీసుకెళ్లి ఎన్నికను వాయిదా వేయించారు. వైఎస్సార్సీపీ అనుచరులు తమ దగ్గర గన్‌లు ఉన్నాయంటూ మమ్మల్ని బెదిరించారు. ఇలా కిందిస్థాయి అధికారులను లక్ష్యంగా చేసి బెదిరించటం ప్రజాస్వామ్యానికి హాని కలిగించవచ్చు” అని వ్యాఖ్యానించారు.

సుధాకర్ ఈ విషయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి, డీజీపీలు ఈ విషయాన్ని గమనించి పోలీసు ఉద్యోగులకు భరోసా కల్పించాలని కోరారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఎస్‌ఐ ధైర్యాన్ని ప్రశంసిస్తూ, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ వ్యవస్థ గౌరవం కాపాడటం చాలా అవసరం అని అభిప్రాయపడుతున్నారు. రాజకీయ నేతల మాటల వల్ల పోలీస్ వ్యవస్థను దిగజార్చే ప్రయత్నాలు జరగకూడదని పలువురు సామాజిక వేదికల్లో స్పష్టం చేస్తున్నారు.

ఎన్నికల వేళ రాజకీయ నాయకులు ఎంత మాటల దూకుడు ప్రదర్శించినా, ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకాన్ని నాశనం చేయడం తీవ్ర ప్రభావాలు చూపే ప్రమాదం ఉందని. ఎస్‌ఐ సుధాకర్ ఇచ్చిన ఈ కౌంటర్ ఒక వ్యక్తిగత స్పందన కాదే, ఒక పోలీస్ యూనిఫాం వెనుక ఉన్న గౌరవం, బాధ్యతకు ప్రతీకగా మారింది.

Leave a Reply