కాంగ్రెస్‌లో చేరిన జడ్చర్ల మున్సిపల్ చైర్‌పర్సన్.. ఆహ్వానించిన సీఎం రేవంత్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్‌కర్నూల్ పర్యటనలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. జడ్చర్ల మున్సిపల్ చైర్‌పర్సన్ కోనేటి పుష్పలత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానం పలికారు.

కోనేటి పుష్పలతతో పాటు కౌన్సిలర్లు చావా నాగరాజు, లలిత (బీజేపీ), గుండా ఉమాదేవి (బీఆర్ఎస్) కూడా కాంగ్రెస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు.

రేవంత్ పర్యటనలో పలు కార్యక్రమాలు
కాంగ్రెస్‌లో చేరికకు ముందు సీఎం రేవంత్ రెడ్డి కొల్లాపూర్ మండలం జటుప్రోలు మదనగోపాల స్వామి ఆలయాన్ని సందర్శించారు. తర్వాత జటుప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన చేశారు.

తరువాత ముఖ్యమంత్రి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అలాగే స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేయనున్నారు.

రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నేతలు భారీగా ప్రజాసమీకరణ చేపట్టగా, అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసు శాఖ కూడా పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేసింది.

Leave a Reply