తెలుగు సినిమా పరిశ్రమపై తీవ్రమైన ప్రభావం చూపుతున్న పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ (iBomma) తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు హెచ్చరిక లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో, “మీరు మాపై దృష్టి సారిస్తే, మేము కూడా మీపై దృష్టి సారిస్తాము” అని పేర్కొనడం, వెబ్‌సైట్ నిర్వాహకులు పోలీసులపై నేరుగా సవాల్ విసిరినట్లుగా భావించబడుతోంది.
ఇటీవల, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) ఫిర్యాదుతో, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ, బప్పమ్ వంటి 65 పైరసీ వెబ్‌సైట్‌లపై కేసులు నమోదు చేశారు. TFCC తెలిపిన వివరాల ప్రకారం, ఈ వెబ్‌సైట్‌లు కాపీ రైట్ హక్కులు గల థియేట్రికల్ మరియు OTT రిలీజ్ వీడియోలను ఉచితంగా విడుదల చేస్తున్నాయి, దీని వల్ల పరిశ్రమకు భారీ ఆర్థిక నష్టం ఎదురైంది అని వాపోయారు.
అదే విషయం పై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ, “ఐబొమ్మ వంటి వెబ్‌సైట్ నిర్వాహకులు ఎంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినా, అంతర్జాతీయ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) సహాయంతో వారిని ట్రాక్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటాము.” అని చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలో, ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకులు తమపై దృష్టి సారిస్తే, తాము కూడా పోలీసులపై దృష్టి సారిస్తామని హెచ్చరించడం, ఈ వ్యవహారాన్ని మరింత ఉత్కంఠకరంగా మార్చింది. పోలీసులు ఈ సవాల్‌ను ఎలా ఎదుర్కొంటారో ఇప్పుడు ప్రతీక్షించాలి.