హైదరాబాద్ MMTS రైల్లో చోటుచేసుకున్న అత్యాచారయత్నం కేసు సంచలనంగా మారింది. ఒంటరిగా ప్రయాణిస్తున్న యువతిపై ఓ దుండగుడు అత్యాచారయత్నం చేయగా, అతడి బారి నుంచి తప్పించుకునేందుకు ఆమె రైలు నుంచి కిందకు దూకింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.
పోలీసులు అనేక బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టగా, నిందితుడిని మేడ్చల్‌కు చెందిన మహేశ్‌గా గుర్తించారు. బాధిత యువతికి అతని ఫోటోను చూపించగా, తనపై అత్యాచారయత్నానికి పాల్పడింది మహేశ్‌నేనని నిర్ధారించింది. ప్రస్తుతం పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. అనంతపురానికి చెందిన 23 ఏళ్ల యువతి మేడ్చల్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. సెల్‌ఫోన్ మరమ్మతు కోసం సికింద్రాబాద్‌కు వెళ్లిన ఆమె తిరిగి MMTS ట్రైన్‌లో మేడ్చల్‌కి బయలుదేరింది. మహిళల కోచ్‌లో ఎక్కిన బాధితురాలు, అల్వాల్ స్టేషన్ వద్ద ఇతర మహిళా ప్రయాణికులు దిగిపోవడంతో బోగీలో ఒంటరిగా మిగిలిపోయింది.
ఈ అవకాశాన్ని అదునుగా చేసుకున్న మహేశ్, ఆమెపై దాడికి ప్రయత్నించాడు. తనను రక్షించుకునే మార్గం లేకపోవడంతో తీవ్ర భయంతో ఉన్న బాధితురాలు రైలు నుంచి కిందకు దూకింది. కొంపల్లి సమీప రైల్వే బ్రిడ్జి వద్ద కిందపడి తీవ్ర గాయాలు పాలైన ఆమెను తొలుత గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఎంపీ బండి సంజయ్ చొరవతో యశోద హాస్పిటల్‌కి మార్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండి, తీవ్ర గాయాల కారణంగా మాట్లాడలేని స్థితిలో ఉందని తెలుస్తోంది.
ఈ కేసును సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చేపడుతున్నారు.
ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మహిళల భద్రత, రైళ్లలో భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు వస్తున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
పోలీసులు ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి బాధితురాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అదనపు భద్రతా చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.