హైదరాబాద్ మెట్రో రైలు మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. మెట్రో రైళ్లలో బహిరంగంగా జరుగుతున్న బెట్టింగ్ యాప్‌ల ప్రకటనలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ అంశంపై మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అన్ని వివరాలతో కౌంటర్ అఫిడవిట్‌ను తక్షణమే దాఖలు చేయాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
ఈ వ్యవహారంపై హైకోర్టులో అడ్వకేట్ నాగూర్ బాబు ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ప్రతీరోజూ లక్షల మంది ప్రయాణించే మెట్రోలో చట్ట విరుద్ధంగా ఈ తరహా యాప్‌లకు ప్రమోషన్‌లివ్వడం శోచనీయమని ఆయన వ్యాఖ్యానించారు. యువతను వ్యసనాల వైపు మళ్లించే ప్రమాదం ఉందంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
అంతేకాదు, తెలంగాణ గేమింగ్ యాక్ట్ 2017 ప్రకారం ఇటువంటి బెట్టింగ్ యాప్‌లు నిషేధించబడ్డాయని గుర్తుచేశారు. అయినప్పటికీ, మెట్రో యాజమాన్యం సహా దాని అనుబంధ సంస్థలు చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా ముడుపులు తీసుకుని ఈ యాప్‌లకు ప్రోత్సహనం అందించాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమగ్ర విచారణ చేయాలని ఆయన పిటిషన్‌లో కోరారు. ఇందులో అధికారులు, ప్రైవేటు వ్యక్తులు ఎంతమంది లాభం పొందారో విచారణ ద్వారా తేల్చాలని డిమాండ్ చేశారు.
ఈ కేసుపై గురువారం హైకోర్టు కీలక విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి, HMRL ఎండీకి నోటీసులు జారీ చేసి సమగ్ర ఆధారాలతో కౌంటర్ దాఖలు చేయాలన్నారు. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేశారు.
ఈ నేపథ్యంలో మెట్రో యాజమాన్యంపై మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని న్యాయ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ HMRL నిర్లక్ష్యం నిరూపితమైతే, కఠిన చర్యలు తప్పవని సూచనలు కనిపిస్తున్నాయి.