Metro : హైదరాబాద్‌ నిమజ్జనం స్పెషల్.. అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో సేవలు

హైదరాబాద్‌లో శనివారం గణేశ్ నిమజ్జన ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా నగరవాసులకు మెట్రో గుడ్‌న్యూస్ చెప్పింది. అన్ని మెట్రో స్టేషన్ల నుంచి శనివారం ఉదయం గంటల ఆరు గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉండనున్నట్లు ప్రకటించింది. వినాయక నిమజ్జనాన్ని చూడటానికి హుస్సేన్‌సాగర్ సహా వివిధ ప్రాంతాలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివెళ్తారనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు.

అదేవిధంగా ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను నడపనుంది. హుస్సేన్‌సాగర్, ట్యాంక్‌బండ్‌కు భక్తులను తరలించేందుకు బర్కత్‌పురా, ముషీరాబాద్, కాచిగూడ, మెహదీపట్నం, ఫలక్‌నూమా, రాజేంద్రనగర్, దిల్‌సుఖ్‌నగర్, హయత్‌నగర్, మిథాని డిపోల నుంచి ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయనుంది.

కాచిగూడ, రాంనగర్ నుంచి బషీర్‌బాగ్ దాకా, వనస్థలీపురం, ఎల్బీనగర్, కొత్తపేట నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు, అలాగే పటాన్‌చెరు నుంచి లింగంపల్లి, జమై ఉస్మానియా నుంచి ఇందిరాపార్క్ వరకు బస్సు రాకపోకలు కొనసాగనున్నాయి.

మరోవైపు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కీలక విషయాలు వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం 1 గంటలోపే బడా గణేష్ నిమజ్జనం పూర్తవుతుందని చెప్పారు. గత 20 రోజులుగా పోలీసు శాఖ వివిధ విభాగాలతో కలిసి సమీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.

హుస్సేన్‌సాగర్, ట్యాంక్‌బండ్, ఎన్‌టీఆర్ ఘాట్ వద్ద ఇప్పటికే 40 క్రేన్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విగ్రహాలు, వాహనాల ఎత్తు ఎక్కువగా ఉంటే ముందుగానే పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. నగరంలో సుమారు 50 వేల విగ్రహాలు నిమజ్జనం కానున్నాయని, 29 వేల మంది సిబ్బందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.

Leave a Reply