తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనపై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చర్యలు తీసుకుంటున్నట్టు చెబుతున్నప్పటికీ, డ్రగ్స్ దందా మాత్రం ఆగడం లేదు. డ్రగ్స్‌ను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన ఈగల్ స్పెషల్ టీం తాజాగా హైదరాబాద్ నగరంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో డ్రగ్స్ సరఫరా వ్యవహారాన్ని బహిర్గతం చేసింది.
ఈగల్ టీం బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టగా, కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్‌ను కేంద్రంగా భారీగా డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు గుర్తించారు. ఈ దందాకు రెస్టారెంట్ యజమాని సూర్య నేతృత్వం వహిస్తున్నట్టు అధికారుల దర్యాప్తులో వెల్లడైంది.
డాక్టర్ ప్రసన్నకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా
సూర్య స్నేహితుల ద్వారా భీమవరానికి చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రసన్నకి డ్రగ్స్ పంపినట్టు పోలీసులు గుర్తించారు. ఆయన ఇప్పటివరకు సుమారు 20 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు విచారణలో తేలింది. అంతేకాదు, నగరంలోని 23 మంది వ్యాపారవేత్తలకు కూడా డ్రగ్స్ సరఫరా చేసినట్టు ఆధారాలు లభించాయి.
ప్రముఖ పబ్‌లు డ్రగ్ హబ్‌లుగా మారిన పరిస్థితి
ప్రిజమ్, ఫామ్, బర్డ్ బాక్స్, బ్రాడ్ వే, వాక్ కోరా, బ్లాక్ 22 వంటి పబ్‌లకు సూర్య డ్రగ్స్ సరఫరా చేసినట్టు తేలింది. ఈ నేపథ్యంలో క్యూవాక్ పబ్ యజమాని రాజశేఖర్, వాక్ కోరా పబ్ యజమాని పృథ్వీ వీరమాచినేని, బ్రాడ్ వే పబ్ యజమాని రోహిత్ మాదిశెట్టిలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ముగ్గురు కూడా డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు స్పష్టమైన ఆధారాలు దొరికినట్లు సమాచారం.
చెప్పుల్లో దాచిన డ్రగ్స్… నైజీరియన్ మహిళ పాత్ర
ఈ డ్రగ్స్ దందాలో ఢిల్లీకి చెందిన నైజీరియన్ మహిళ నిక్కీ కూడా కీలక పాత్ర పోషించినట్లు ఈగల్ టీం గుర్తించింది. ఆమె లేడీస్ హైహీల్స్ చెప్పుల లోపల డ్రగ్స్ దాచి, మల్నాడు రెస్టారెంట్‌కు పార్సిల్‌గా పంపినట్లు తేలింది. నిక్కీ, జెర్రీ అనే మరో నైజీరియన్ కలిసి ఈ సరఫరాలో పాల్గొన్నారని అధికారులు తెలిపారు.
సూర్య రిసార్ట్ పార్టీల ద్వారా సరఫరా
సూర్య ములుగులో ఓ రిసార్ట్ బుక్ చేసి, తన స్నేహితులకు డ్రగ్స్ పార్టీలు నిర్వహించిన విషయమూ వెల్లడైంది. తాజా దాడులతో పాటు, మరిన్ని పబ్‌లపై ఈగల్ టీం దాడులకు సిద్ధమవుతోందని సమాచారం.
రాజకీయ ప్రోత్సాహంతో పబ్‌లు తిరిగి తెరిచే ప్రమాదం?
డ్రగ్స్ కేసుల్లో పట్టుబడ్డ పబ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ, రాజకీయ లింకులతో కొంతమంది యజమానులు తిరిగి కార్యకలాపాలు ప్రారంభిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.