హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అక్రమాల కేసులో ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. గతంలో నమోదైన రెండు హెచ్‌సీఏ కేసులను కలిపి కొత్తగా ఈసీఐఆర్ (ECIR) నమోదు చేసింది. ఈ కేసులో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు, సీఈవో సునీల్, ట్రెజరర్ శ్రీనివాసరావు, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, ప్రెసిడెంట్ కవిత యాదవ్‌లపై పీఎమ్ఎల్ఏ (PMLA) సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. బీసీసీఐ నిధుల విషయంలో మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. సీఐడీ కస్టడీ పూర్తయ్యాక వారిని ఈడీ కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది.
సీఐడీ దర్యాప్తు వేగం పెంచింది
మరోవైపు హెచ్‌సీఏ అక్రమాలపై కొరడా ఝులిపించిన సీఐడీ, దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. అవినీతి తాలూకు అన్ని వివరాలను బయటకు తీయడానికి జగన్మోహన్‌రావు, సీఈవో సునీల్, ట్రెజరర్ శ్రీనివాసరావు, రాజేందర్ యాదవ్, కవిత యాదవ్‌లను ఆరు రోజుల కస్టడీకి తీసుకొని విచారణ కొనసాగిస్తోంది. హెచ్‌సీఏ క్లబ్బుల్లో జరిగిన అవకతవకలు, గత ఎన్నికల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సీఐడీ ప్రధానంగా ఫోకస్ చేసింది. హెచ్‌సీఏకు వచ్చిన నిధులు, వాటి వినియోగం ఎలా జరిగిందనే అంశంపై లోతుగా విచారిస్తోంది. అధికారులు వీరిని ప్రశ్నిస్తే మరిన్ని షాకింగ్ విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఏ2 దేవరాజ్ పరారీలో.. సీఐ సస్పెన్షన్
ఇక ఈ కేసులో ఏ2గా ఉన్న హెచ్‌సీఏ సెక్రటరీ దేవరాజ్ తప్ప మిగతా అధికారులంతా సీఐడీ కస్టడీలోనే ఉన్నారు. దేవరాజ్ మాత్రం ముందస్తుగా సమాచారం తెలుసుకొని పరారీలోకి వెళ్లిపోయాడు. దేవరాజ్ పారిపోవడానికి ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి సహకరించినట్లు విచారణలో బయటపడింది. దేవరాజ్ అరెస్టుకు సీఐడీ రంగం సిద్ధం చేయగా, ఆ సమాచారం ముందే దేవరాజ్‌కు చేరవేశాడు ఎలక్షన్ రెడ్డి. దీంతో దేవరాజ్ తప్పించుకున్నాడు. సీఐడీ సమాచారాన్ని లీక్ చేసినందుకు సీఐ ఎలక్షన్ రెడ్డిపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.