High Court : గ్రూప్‌-1 కేసులో హైకోర్టు సంచలన తీర్పు.. మళ్లీ మెయిన్స్ పరీక్షలే!

గ్రూప్‌-1 కేసులో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలను మళ్లీ నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్స్ లిస్ట్‌ను రద్దు చేయాలని స్పష్టం చేసింది.

మెయిన్స్‌ పేపర్లను తిరిగి మూల్యాంకనం చేయాలని, ఆ తర్వాతే ఫలితాలను విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. ఒకవేళ మూల్యాంకనం సాధ్యం కాకపోతే తిరిగి పరీక్షలు నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీకి ధర్మాసనం స్పష్టం చేసింది.

గతంలో మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, పరీక్షలను రద్దు చేస్తూ తుది తీర్పు ఇచ్చింది. దీంతో గ్రూప్‌-1 మెరిట్‌ లిస్ట్ రద్దయింది.

జస్టిస్ నామావరపు రాజేశ్వరరావు ధర్మాసనం సుదీర్ఘ విచారణ అనంతరం జూలై 7న వాదనలు ముగించి తీర్పును రిజర్వులో ఉంచింది. కాగా ఏప్రిల్‌లో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను ప్రకటించింది. వాటిలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కొంతమంది అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు.

ఇక ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్తర్వులు అందుకునే దశలో ఉన్న అభ్యర్థులు మాత్రం పరీక్షలను రద్దు చేయరాదని కోర్టును ఆశ్రయించారు. ఈ వాదనలు విన్న హైకోర్టు, చివరికి గ్రూప్‌-1 ఫలితాలను రద్దు చేసి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.

తాజా తీర్పుతో, కొంతమంది అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Leave a Reply