తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు శుభవార్త అందించింది. ఉగాది పండుగ నుంచి కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు పేదలకు సన్న బియ్యం పంపిణీ ప్రారంభించేందుకు సిద్ధమైంది. గత ప్రభుత్వం అర్హులైన పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేయలేదని ఆరోపించిన ప్రస్తుత ప్రభుత్వం, అందరికీ న్యాయం జరిగేలా ఈ కొత్త విధానాన్ని అమలు చేయనుంది.
ప్రభుత్వం జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియను ప్రారంభించినట్లు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. కొత్త కుటుంబ సభ్యుల పేర్లు కార్డుల్లో చేర్చే అవకాశం కల్పించడంతో పాటు, అర్హులైన పేద కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.5,734 కోట్లు కేటాయించిందని మంత్రి వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా పేదలకు సన్న బియ్యం అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఉగాది రోజున అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారుల సంఖ్యను పరిశీలించి ఒక్కొక్కరికీ 6 కిలోల సన్న బియ్యం అందజేయనున్నారు.
తెలంగాణలో ప్రస్తుతం 91,19,268 రేషన్ కార్డులు ఉండగా, 2,82,77,859 మంది లబ్ధిదారులు ఉన్నారు. ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటి వరకూ ఉన్న కార్డుదారులకే ముందుగా సన్న బియ్యం అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఉగాది రోజున సీఎం రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. మొదట ప్రభుత్వం ఈ స్కీమ్‌ను జనవరి నుంచే ప్రారంభించాలని భావించినా, కొత్త రేషన్ కార్డులపై స్పష్టత రావాల్సి ఉండటంతో ఆలస్యం జరిగింది.