తెలంగాణలో గిగ్ వర్కర్లకు గుడ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫుడ్ డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు, ప్యాకేజింగ్ డెలివరీ జాబ్ చేస్తున్న లక్షల మంది గిగ్ వర్కర్ల భద్రత కోసం ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 25 నాటికి “తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ బిల్లు” ముసాయిదా సిద్ధం చేసి, మే డే (మే 1) రోజునే చట్టంగా అమల్లోకి తేవాలని సూచించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో గిగ్ వర్కర్ల హక్కులపై దృష్టిసారించారు. బీమా, ఉద్యోగ భద్రత, ఆరోగ్య సేవలు వంటి మౌలిక హక్కులను ఈ బిల్లులో పొందుపరచాలని అధికారులకు సూచించారు. బిల్లు ముసాయిదాను ఆన్‌లైన్‌లో ఉంచి ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించాలని సూచించారు.
పబ్లిక్ కామెంట్స్‌తో పాటు, పలు వర్గాల నిపుణుల సలహాలను పరిశీలించి తుది ముసాయిదా సిద్ధం చేయాలని సీఎం స్పష్టంగా తెలిపారు. “ఇది కేవలం చట్టమే కాదు, లక్షల మంది వర్కర్ల భవిష్యత్తుకు బలమైన గ్యారంటీ అవుతుంది,” అని అన్నారు.
గిగ్ వర్కర్లకు భద్రత కల్పించడానికి ఉద్దేశించిన బిల్లు ముసాయిదాను వెంటనే ప్రజాభిప్రాయానికి అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి @revanth_anumula గారు ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తుది ముసాయిదాను రూపొందించాలని సూచించారు.
❇️గిగ్ వర్కర్లు,… pic.twitter.com/6bDvEgKza5
— Telangana CMO (@TelanganaCMO) April 14, 2025
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4 లక్షల మంది గిగ్ వర్కర్లు వివిధ ప్లాట్‌ఫామ్‌లలో సేవలు అందిస్తున్నట్లు అధికార వర్గాలు నివేదికలో పేర్కొన్నాయి. ఇక గిగ్ వర్కర్లు మరణిస్తే రూ.5 లక్షల ప్రమాద బీమా అమలులోకి ఇప్పటికే 2023 డిసెంబర్‌లో వచ్చినట్టుగా తెలిపారు. కొత్తగా వస్తున్న ఈ చట్టం దేశానికి మార్గదర్శకంగా నిలవాలని, ఇతర రాష్ట్రాలు కూడా ఇదే మార్గాన్ని అనుసరించేలా ఉండాలన్నది సీఎం లక్ష్యం.
ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. కార్మికుల హక్కులు, భద్రతపై తెలంగాణ తీసుకుంటున్న ఈ చర్యపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తే అవకాశం ఉంది.