Revanth Reddy: జీనోమ్ వ్యాలీ పరిశ్రమలతో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు: సీఎం రేవంత్ రెడ్డి

దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తిలో 33% వాటా కేవలం జీనోమ్ వ్యాలీదే అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని భయపెట్టిన సమయంలో కూడా జీనోమ్ వ్యాలీ నుంచే వ్యాక్సిన్లు తయారై, ప్రపంచ దేశాలకు సరఫరా చేయగలిగామన్నారు.

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా జీనోమ్ వ్యాలీలో ఐకోర్ బయోలాజిక్స్ కొత్త యూనిట్ భూమిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం మాట్లాడుతూ, జీనోమ్ వ్యాలీ పరిశ్రమలు తెలంగాణకు గ్లోబల్ గుర్తింపును తెచ్చిపెట్టాయని తెలిపారు.

2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం లక్ష్యమని, ఇందులో భాగంగా ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్’ ను ఈ ఏడాది డిసెంబర్ 9న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 30 ట్రిలియన్ ఎకానమీ సాధనలో తెలంగాణ తన వంతు కృషి చేస్తుందని తెలిపారు.

పెట్టుబడుల కోసం అవసరమైన పాలసీలు, అనుమతులు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూ వస్తున్నామని, ప్రభుత్వాలు మారినా పరిశ్రమలకు ఇబ్బంది కలిగే విధానాలు ఎప్పుడూ తీసుకురాలేదన్నారు.

ప్రస్తుతం మరింత మెరుగైన పారిశ్రామిక విధానాలను తీసుకువచ్చి, కొత్త పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. గత 18 నెలల్లో రూ.3 లక్షల 28 వేల కోట్ల పెట్టుబడులను తెలంగాణకు రప్పించగలిగామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణను ప్రపంచంతో పోటీ పడేలా, గ్లోబల్ స్థాయి పరిశ్రమలను ఆకర్షించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

Leave a Reply