గణేష్ నిమజ్జనం ఊరేగింపులో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి, 22 మందికి గాయాలు

దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు కన్నులపండువగా గణపయ్యను ఆరాధించారు. డ్యాన్సులు, పాటలు, అన్నదాన కార్యక్రమాలతో ఉత్సవాలు సందడిగా సాగాయి. కొందరు మూడు, ఐదు, ఏడు, తొమ్మిది, పదకొండు రోజులు భక్తి శ్రద్ధలతో గణపయ్యను పూజించారు. అయితే నిమజ్జనం వేళ కొన్ని చోట్ల ఘోర ప్రమాదాలు చోటుచేసుకుని ఆనందాన్ని విషాదంగా మార్చేశాయి.

అలాంటి ఘోర సంఘటన శుక్రవారం రాత్రి కర్ణాటకలోని హసన్‌లో జరిగింది. గణేష్ విగ్రహ నిమజ్జన ఊరేగింపు జరుగుతుండగా, ఒక కంటైనర్ లారీ అత్యంత వేగంగా దూసుకువచ్చి జనాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించగా, మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హసన్ HIMS ఆసుపత్రికి తరలించగా, అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మిగిలిన ఏడుగురికి కూడా చికిత్స అందుతుందని వెల్లడించారు.

ఈ ప్రమాదానికి కారణం ఒక బైక్ అని చెబుతున్నారు. లారీ ఒక బైక్‌ను ఢీకొట్టకుండా తప్పించుకునే ప్రయత్నంలోనే ఊరేగింపులోకి దూసుకెళ్లిందని సమాచారం. ఈ ప్రమాదంలో డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు.

ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గణేష్ నిమజ్జనం ఊరేగింపులో జరిగిన ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సానుభూతి తెలుపుతూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడిన వారి చికిత్స ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు.

Leave a Reply