హైదరాబాద్ నగరంలోని ప్రసిద్ధ సాంస్కృతిక వేదిక రవీంద్రభారతిలో నకిలీ డాక్టరేట్ సర్టిఫికెట్లు పంపిణీ చేస్తున్న ఘటన పెద్ద కలకలం రేపింది. ఈ వ్యవహారంలో పెద్దితి యోహాను అనే వ్యక్తిని సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల సమాచారం ప్రకారం, యోహాను “కవి గుర్రం జాషువా స్మారక కళా పరిషత్” అనే పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ, “గౌరవ డాక్టరేట్” పేరుతో ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఈ కార్యక్రమాల్లో పలువురు రచయితలు, కళాకారులు, వైద్యులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.
పరిశీలనలో భాగంగా పోలీసులు యోహాను వద్ద నుండి నకిలీ సర్టిఫికెట్లు, ఖాళీ పత్రాలు, స్టాంపులు మరియు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌కి (FSL) పంపిన ఫోన్ ద్వారా మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
యోహాను సోషల్ మీడియాలో మరియు వాట్సాప్ ద్వారా “గౌరవ డాక్టరేట్” కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటనలు ఇచ్చాడు. డాక్టరేట్ కోసం రూ.15,000 నుండి రూ.20,000 వరకు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. చదువు స్థాయి ఏదైనా కావొచ్చు – సర్టిఫికేట్ ఇవ్వగలమని అతను హామీ ఇచ్చాడట.
సాహిత్య, విద్యా వర్గాలు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిజమైన విద్యా విలువలను తక్కువ చేసి, డబ్బు కోసం “డాక్టరేట్” పదవిని అమ్మడం సిగ్గుచేటని పలువురు విమర్శించారు.
ఇప్పటికే యోహానును విచారిస్తున్న పోలీసులు, గతంలో ఇలాంటి ఎన్ని కార్యక్రమాలు నిర్వహించారో, ఎవరికెవరికీ నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారో, మొత్తం ఎన్ని రూపాయలు వసూలు చేశారో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు.

 
			 
			 
			