ఏపీ అటవీశాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఓ కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే ఈ వ్యవహారం లో ముందుకెళ్తే సమస్య, వెనక్కు తగ్గితే మరింత పెద్ద ఇబ్బంది అనే విధంగా ఉంది. జనసేన ఈ అంశంలో స్పందిస్తూ, సీఎం చంద్రబాబుపైనే భారం వేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. అసలు పవన్ కళ్యాణ్ ఇబ్బందిలో పడటానికి గల కారణాలు ఏమిటో తెలుసుకుందాం.
పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని కొల్లేరు సరస్సు గత కొన్నేళ్లుగా అక్రమ కబ్జాలకు గురైంది. దీని కారణంగా జల ప్రవాహం తగ్గిపోయి, వరద ముప్పు పెరిగింది. 2006లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సుప్రీంకోర్టు ఆదేశాలతో ‘ఆపరేషన్ కొల్లేరు’ చేపట్టి, వేలాది చేపల చెరువుల గట్లను ధ్వంసం చేయించారు. అయితే ఆ తర్వాత ఈ చర్య నెమ్మదించగా, తాజాగా మరోసారి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలై, ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది.
ప్రభుత్వం కోర్టుకు మూడు నెలల్లో ఆక్రమణలు తొలగిస్తామని హామీ ఇచ్చినా, భూసేకరణ, పునరావాస సమస్యల కారణంగా వేగంగా చర్యలు తీసుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలనే చర్చ మొదలైంది.
‘ఆపరేషన్ కొల్లేరు’ పునరుద్ధరణపై ముందుకెళ్తే స్థానికుల నుండి తీవ్ర వ్యతిరేకత రావచ్చు. కానీ, దీన్ని పట్టించుకోకుండా ఉంటే సుప్రీంకోర్టు ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఈ దశలో జనసేన పార్టీ స్పందిస్తూ, సీఎం చంద్రబాబు అనుభవంతో నిర్ణయం తీసుకుంటారని, ఇది పూర్తిగా ఆయన పరిధిలోని అంశమే అని ప్రకటన విడుదల చేసింది.
జనసేన తన ప్రకటనలో 2006లో వైఎస్సార్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు తీరుపై విమర్శలు చేసింది. నాటు బాంబులతో చెరువులను పేల్చడం, ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకపోవడం వంటి అంశాలను ప్రస్తావించింది. కోర్టులు, ప్రభుత్వాలు అప్పట్లో ప్రజా సమస్యలను పట్టించుకోకుండా త్రీవ చర్యలు తీసుకున్నాయని వ్యాఖ్యానించింది.
జనసేన ప్రకటనలో కొల్లేరు సమస్య సంక్లిష్టతను విశ్లేషిస్తూ, వైఎస్సార్ హయాం నుండి వైసీపీ పాలన వరకూ ప్రతి దశలో రాజకీయ అవసరాలకు అనుగుణంగా చర్యలు జరిగాయని పేర్కొంది. జనసేన పార్టీ పర్యావరణ పరిరక్షణ సిద్ధాంతంతో ఈ అంశాన్ని పరిష్కరించేందుకు చర్చలు జరుపుతుందని తెలిపింది.
ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్, ప్రభుత్వ అధికారులతో, నిపుణులతో, స్థానిక ప్రజలతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది. ఒడిశాలోని చిల్కా సరస్సులో ఎదురైన సమస్యలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపింది.
చంద్రబాబు నాయుడు గతంలో సంక్లిష్ట సమస్యలను పరిష్కరించిన అనుభవం ఉందని, ఆయన నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కొల్లేరు సమస్యను పరిష్కరిస్తుందని జనసేన అభిప్రాయపడింది. ఈ వ్యవహారంపై భారం మొత్తాన్ని చంద్రబాబుపైనే వదిలేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ అంశంపై మరింత స్పష్టత రాబోయే రోజుల్లో ఉండనుంది.